కొవిడ్-19ను 'చైనీస్ వైరస్'గా వ్యవహరించటాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. వైరస్‌కు సంబంధించి అమెరికా, చైనా మధ్య వాగ్వాదం నడుస్తున్న సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వైరస్‌కు సంబంధించి అమెరికాపై చైనా చేస్తోన్న విమర్శల నేపథ్యంలో స్పందించారు ట్రంప్. వుహాన్‌లో అమెరికా సైన్యం సందర్శనతోనే వైరస్ వ్యాపించిందన్న ఆరోపణలనూ తోసిపుచ్చారు.
"కరోనా వైరస్ చైనా నుంచే వచ్చింది. అందువల్ల చైనీస్ వైరస్ అనే పదం సరిగ్గా సరిపోతుంది. వైరస్‌కు మొదలైన క్రమానికి సంబంధించి చైనా చేస్తోన్న ఆరోపణలు అవాస్తవం. మా సైన్యం వారికి వైరస్ వ్యాప్తి చేశాయన్న ఆరోపణలు ఆమోదయోగ్యం కాదు. అలా మా సైన్యం చేయలేదు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అమెరికా వర్సెస్ చైనా..
వైరస్ వ్యాప్తికి మీరంటే మీరే కారణమంటూ అమెరికా, చైనా ఘర్షణ పడుతున్నాయి. కరోనా నుంచి గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా 'చైనీస్ కరోనా వైరస్' అంటోంది అమెరికా యంత్రాంగం. 'చైనీస్ వైరస్' అంటూ మరో అడుగు ముందుకేశారు ట్రంప్. చైనాను ఉద్దేశించి సార్స్, కోవిడ్-19 లను 'వుహాన్ వైరస్'గా పదేపదే ప్రస్తావించారు అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో.
ఈ నేపథ్యంలో అమెరికా సైన్యం వుహాన్‌కు వైరస్ తీసుకొచ్చిందని గతవారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ఆరోపించారు. ఈ మేరకు చైనాలోని పలు ఛానళ్లు ప్రసారం చేశాయి.
ఈ రెండు దేశాల పరస్పర ఆరోపణలతో ఆసియా-అమెరికా సమాజాల మధ్య జాత్యాంహకార ధోరణికి దారితీయవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి:'కరోనా వచ్చినా భయపడొద్దు.. ఇలా చేస్తే సరి'