తెలంగాణ

telangana

ETV Bharat / international

'మా దేశం ఫుల్​... ఎవరూ రావొద్దు'

అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మెక్సికో నుంచి అక్రమ వలసలకు అమెరికాలో చోటు లేదని తేల్చి చెప్పారు. వెనక్కి వెళ్లాల్సిందేనని వలసదారులను హెచ్చరించారు.

డొనాల్డ్ ట్రంప్

By

Published : Apr 6, 2019, 4:00 PM IST

అమెరికాలో చోటు లేదు

2020 అమెరికా ఎన్నికలకు ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కాలిఫోర్నియా సమీపంలోని మెక్సికో సరిహద్దులో ట్రంప్ శుక్రవారం పర్యటించారు. ఇక మీదట అక్రమ వలసలను సహించేది లేదని స్పష్టం చేశారు.

"ఎల్ సెంట్రో సెక్టార్​లోని 70 మైళ్ల సరిహద్దు ప్రాంతాల్లో అక్టోబర్ నుంచే కుటుంబాల సంఖ్య 400 శాతం పెరిగింది. గత కొన్నేళ్లతో పోల్చితే ఇదెంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. అమెరికా మొత్తం నిండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేయటానికి ఏమీలేదు. 'మేం మిమ్మల్ని రానివ్వలేం. మన్నించండి' అని చెప్పటమే. అలాంటిది మనం వాళ్లను రానిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇక వలసదారులను రానివ్వటానికి వీల్లేదంటే వీల్లేదు."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

వలసవాదులతో మధ్య అమెరికాలో హింసాత్మక సంఘటనలు పెరుగుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. రాజకీయ విభేదాలూ పెరిగిపోతున్నాయని, ఇది అత్యవసర పరిస్థితికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దు గోడపైనా స్పష్టతనిచ్చారు ట్రంప్.

"కొన్ని చోట్ల 30 అడుగులు, మరి కొన్ని ప్రాంతాల్లో 15 కానీ 12 అడుగుల మేర గోడ నిర్మిస్తాం. గోడలో అధిక భాగం బలంగా, ఎక్కడానికి వీలులేకుండా కడతాం. అంతకంటే చెప్పడానికి ఏమీలేదు. నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. పనులు ముందుకు సాగుతాయి."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడి నిర్ణయంపై నిరసనలు వ్యక్తం చేశారు వలస ప్రజలు. గోడ కట్టి కుటుంబాలను రెండుగా విడదీయటం అన్యాయమని ఆక్షేపించారు.

"కుటుంబాలను వేరు చేయటం ఆపేయండి. మీరు గోడ కడితే మా భవిష్యత్తు తరాలు చీలిపోతాయి."
-సరిహద్దులో నిరసనకారులు

ట్రంప్​ నిర్ణయానికి స్థానిక ప్రజలు మద్దతునిచ్చారు. ట్రంప్ వాహన శ్రేణి వెళుతున్న దారిలో 'గోడను నిర్మించండి' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ముందస్తు వ్యూహాలు

మెక్సికో నుంచి అక్రమ వలసలపై ట్రంప్ ముందుగానే స్పష్టతనిచ్చారు. సరిహద్దును మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వలసలతోపాటు మత్తు పదార్థాల రవాణా నియంత్రించకపోతే పన్నులు పెంచుతామని మెక్సికో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details