ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటివరకు 5కోట్ల 3లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. కొవిడ్ సోకిన వారిలో 12.58 లక్షల మంది బలయ్యారు. 3.56 కోట్ల మందికిపైగా కరోనాను జయించగా.. ప్రస్తుతం 1.35కోట్ల యాక్టివ్ కేసులున్నాయి.
కొవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని సింగపూర్‌లో విధించిన లాక్డౌన్లో ఎలాంటి సడలింపులు ఉండవని ఆ దేశ ప్రధాని లీ హ్సేన్ పేర్కొన్నారు. ఆ దేశంలో ఇప్పటివరకు 58వేలకుపైగా కరోనా సోకగా.. 28 మరణాలు నమోదయ్యాయి.
శ్రీలంక రాజధానిలో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ దేశంలో ఇప్పటివరకు 13,419 కరోనా కేసులు నమోదవ్వగా.. వారిలో 34 మంది చనిపోయారు.
- కరోనా కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 1.01 కోట్ల వైరస్ కేసులు వెలుగుచూశాయి. వారిలో 2.43లక్షల మందిని కొవిడ్ బలితీసుకుంది.
- రష్యాలో ఒక్కరోజులోనే 20,498 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 17లక్షల 74వేలకు చేరింది. దీంతో కేసుల పరంగా నాలుగో స్థానానికి చేరింది రష్యా. ఆ దేశంలో కొత్తగా 286మంది మరణించడం వల్ల.. మొత్తం మృతుల సంఖ్య 30, 537కు పెరిగింది.
- పోలండ్‌లో వైరస్ విజృంభిస్తోంది. మరో 24,785 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 5.46 లక్షలకు చేరింది. ఇప్పటివరకు అక్కడ 7,872 వైరస్ మరణాలు సంభవించాయి.
- నేపాల్‌లో ఆదివారం ఒక్కరోజే 2,817 మందికి మహమ్మారి సోకినట్టు తేలింది. మొత్తం కేసుల సంఖ్య 1,94,453కు చేరింది. కొవిడ్ ధాటికి మరో 21 మంది ప్రాణాలు కోల్పోగా.. చనిపోయిన వారి సంఖ్య 1,108కి పెరిగింది.
- పాక్‌లో మరో 1,436 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3,43,189కు పెరిగింది. పొరుగు దేశంలో ఇప్పటివరకు 6,968 మరణాలు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:జూన్ నుంచి చైనాలోనే భారత నౌక.. సిబ్బంది ఆవేదన