కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రపంచ దేశాలు ఆర్థిక లక్ష్యాల కంటే మానవ శ్రేయస్సుపై ప్రధానంగా దృష్టి సారించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జీ-20 దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన మోదీ.. ఈ విపత్కర సమయంలో ప్రపంచ దేశాలు పరస్పర సహకారం అందిపుచ్చుకోవాలని సూచించారు.
"కరోనా ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు పతనం అవుతున్నాయి. ఆరోగ్య సంక్షోభం ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సమర్థవంతమైన 'విపత్తు నిర్వహణ (ప్రోటోకాల్) విధివిధానాలు', 'బలమైన కార్యాచరణ ప్రణాళిక' రూపొందించాల్సిన అవసరం ఉంది."
- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి
సంక్షోభాన్ని నివారించేందుకు..
కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు శాస్త్ర పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. ఇందుకు కావలసిన విధివిధానాలను అభివృద్ధి చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.