తెలంగాణ

telangana

ETV Bharat / international

నిద్రలోకి జారుకుంది... విమానంలోనే ఉండిపోయింది!

కెనడా విమాన సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. నిద్రలోకి జారుకున్న తనను ప్రయాణం ముగిసిన అనంతరం లేపకుండా వదిలేసి వెళ్లారు సిబ్బంది. ఫలితంగా అత్యంత భయానక పరిస్థితిని ఎదుర్కొన్నాని వివరించింది టిఫాని ఆడమ్స్ అనే ఆ బాధితురాలు.

నిద్రలోకి జారుకుంది... విమానంలోనే ఉండిపోయింది!

By

Published : Jun 24, 2019, 9:23 PM IST

కెనడాలో విమాన సిబ్బంది నిర్లక్ష్యం ఓ మహిళకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రయాణం ముగిసినా నిద్రలో ఉన్న తనను లేపకుండా వెళ్లిపోయిన సిబ్బంది తీరుతో ఎదురైన భయానక పరిస్థితులను వివరించింది. కెనడా దేశీయ విమానంలో క్యూబెక్​ నుంచి టోరెంటోకు ప్రయాణించింది టిఫాని ఆడమ్స్​ అనే మహిళ. నిద్రలోకి జారుకున్న తనను లేపకుండా సిబ్బంది వదిలేసి వెళ్లారు. నిద్ర నుంచి లేచి చూడగా తన శరీరం చలికి వణుకుతోందని, సీటు బెల్టు అలాగే ఉండటం చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించింది.

జూన్ 9న జరిగిన ఈ ఘటనలో 90 నిమిషాల పాటు చలి, చీకట్లోనే మగ్గిపోయానని, అత్యంత భయానక పరిస్థితిని ఎదుర్కొన్నానని స్పష్టం చేసింది. తనను అలా నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిన విమాన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది బాధితురాలు.

ఎయిర్ కెనడా విమానంలో టిఫాని ఆడమ్స్​కు ఎదురైన చేదు అనుభవంపై ఆమె స్నేహితురాలు డయనా నోయల్ డేల్ విమానయాన సంస్థ ఫేస్​బుక్​ పేజీలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్​పై 600 మంది స్పందించారు.

ఘటన బయటపడిందిలా!

తాను విమానంలో ఇరుక్కుపోయినట్లు బాధితురాలు టిఫాని తన స్నేహితురాలు డయానాకు ఫోన్​ చేసింది. బ్యాటరీ అయిపోయిన కారణంగా ఒక్క నిమిషం కంటే ఎక్కువ మాట్లాడలేకపోయింది టిఫాని. విమానం నిలిపివేసినందువల్ల ఫోన్​కు ఛార్జింగ్​నూ పెట్టుకోలేకపోయింది.

బయటి వ్యక్తులకు తనపై దృష్టి పడేలా చేయాలనుకుని వెలుతురు చూపింది. ఎట్టకేలకు లగేజి విభాగంలో పనిచేసే ఓ వ్యక్తి టిఫానీ విమానంలో చిక్కుకుందని గుర్తించాడు. కష్టపడి ఆమెను రక్షించాడు. తన తప్పును సవరించుకునేందుకు ఎయిర్​ కెనడా సంస్థ బాధితురాలికి హోటల్ వసతితో పాటు కారును ఏర్పాటు చేస్తామని తెలిపింది. అయితే వాటిని తిరస్కరించి ఇంటికి చేరింది టిఫాని ఆడమ్స్.

ఎయిర్ కెనడా విచారం

ఘటన జరిగిన విషయం వాస్తవమేనని, దీనిపై విచారణ కొనసాగుతోందని ప్రకటించింది ఎయిర్​ కెనడా విమానయాన సంస్థ.

ఇదీ చూడండి: 'అణ్వాయుధాలు వీడితే ఆప్త మిత్రుడినవుతా'

ABOUT THE AUTHOR

...view details