అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరిగి పక్షం రోజులు కాకముందే ఆ దేశం నుంచి ఇప్పటికే వేల కోట్ల సహాయం భారత్‌కు అందింది. అమెరికా నుంచి సహాయక విమానాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అర బిలియన్ డాలర్ల(సుమారు రూ.3,667 కోట్లు) విలువైన వైద్య పరికరాలు, ఇతర సామాగ్రిని అమెరికా భారత్‌కు అందించింది. బైడెన్ ప్రభుత్వం సాయం చేస్తామన్న 100 మిలియన్ డాలర్లు, ఫార్మా సంస్థ ఫైజర్ నుంచి 70 మిలియన్ డాలర్లు, 4.5 లక్షల ఫైజర్ డోసులు(175 మిలియన్ డాలర్లు) ఇందులో ఉన్నాయి.
గతనెలలో మోదీతో మాట్లాడిన బైడెన్.. భారత్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అమెరికాకు భారత్ సహాయం పంపించిన విధంగానే.. తామూ భారత్‌కు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:భారత్‌కు అండగా ఉంటామని పిచాయ్, నాదెళ్ల హామీ
తన సన్నిహిత భాగస్వామికి అమెరికా ప్రభుత్వం చేస్తున్న సాయం చూసి అక్కడి కార్పొరేట్ వర్గాలు సైతం కదిలొచ్చాయి. గ్లోబల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి భారత్‌కు విరాళాలు అందిస్తున్నాయి. దీని ద్వారా 18 మిలియన్ డాలర్లను అందించనున్నట్లు గూగుల్ ప్రకటించింది. బోయింగ్, మాస్టర్‌కార్డ్ తలో 10 మిలియన్ డాలర్ల చొప్పున సహాయాన్ని ప్రకటించాయి.
"ఈ నెల చివరి నాటికి మొత్తం సహాయం విలువ ఒక బిలియన్ డాలర్లు దాటుతుంది. అమెరికాలోని భారత సంతతి ఇక్కడి పరిస్థితులను చూసి చలించిపోతున్నారు. ప్రతిఒక్కరు ఏదో ఓ సందర్భంలో దీని గురించి ఆలోచిస్తున్నారు."
-ముకేశ్ అఘి, 'అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం' నిపుణుడు
"గత రెండు వారాల నుంచి అమెరికా వ్యాప్తంగా భారత్‌కు గణనీయ మద్దతు లభిస్తోంది. అమెరికా ప్రభుత్వం, వ్యాపార వర్గాలు, ప్రజల నుంచి సహకారం అందుతోంది. ఇది అసాధారణమైనది. ఇరుదేశాల మధ్య ఉన్న లోతైన అనుబంధానికి ఇది నిదర్శనం. గతేడాది కరోనా ఉద్ధృతి కొనసాగినప్పుడు అమెరికాకు భారత్ అండగా నిలబడిన విషయాన్ని అమెరికన్లు గుర్తుంచుకున్నారు. అయితే భారత్‌లో ప్రస్తుతం తీవ్రమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉంది."