ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ జరిపిన దాడిలో అగ్రరాజ్యానికి భారీ ప్రాణ నష్టం కలిగినట్టు తెలుస్తోంది. డజనుకుపైగా బాలిస్టిక్ క్షిపణులతో ఇరాక్‌లోని అల్ అసద్, ఆర్బిల్ మిలిటరీ స్థావరాలపై దాడి చేసినట్టు ప్రకటించిన ఓ ఇరానీ వార్తా సంస్థ.. ఈ ఘటనలో అమెరికాకు చెందిన 80మందికిపైగా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. ఈ ఆపరేషన్‌కు "మార్టర్ సులేమానీ" అనే పేరు పెట్టినట్టు తెలిపింది. రివల్యూషనరీ గార్డ్స్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ మరణానికి ప్రతీకారంగానే దాడి చేసినట్లు స్పష్టం చేసింది.
22 క్షిపణులతో దాడి!
అమెరికా దళాలపై ఇరాన్ ఎన్ని క్షిపణులతో దాడి చేసిందనే అంశంపై స్పష్టత లేదు. అయితే ఈ ఆపరేషన్‌లో ఇరాన్ 22 మిసైల్స్‌ను ఉపయోగించినట్టు ఇరాక్ మిలిటరీ తెలిపింది. వీటిల్లో 17 అల్ అసద్, 5 అర్బిల్ సైనిక స్థావరాలపై పడినట్టు పేర్కొంది. ఈ ఘటనలో ఇరాక్ బలగాల్లో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని ప్రకటించింది.