కరోనా వైరస్ విషయంలో తన బృందంతో అధ్యక్షుడు ట్రంప్ పాలకవర్గం సహకరించాలని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కోరారు. వ్యాక్సిన్ ప్రణాళికలు, జాతీయ భద్రత, విధానపరమైన సమస్యల్ని అధికార బదిలీ నిమిత్తం ఏర్పాటు చేసిన తన బృందంతో పంచుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అధికార మార్పిడికి ట్రంప్ నిరాకరిస్తుండడంపై బైడెన్ ఈ స్థాయిలో స్పందించడం ఇదే తొలిసారి.
వ్యాక్సిన్ పంపిణీ చాలా కీలకమైన ప్రక్రియ అని బైడెన్ అన్నారు. దానికోసం తక్షణమే ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తాను అధికార బాధ్యతలు చేపట్టబోయే జనవరి 20వరకు వేచిచూస్తే మహమ్మారిని అరికట్టడానికి సమయం మించిపోతుందని వాపోయారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా తమతో సహకరించాలని అధ్యక్షుణ్ని కోరారు. ట్రంప్ నిరాకరిస్తే.. తాము తమ సొంత ప్రణాళికల్ని అమలు చేయాల్సి ఉంటుందని బైడెన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రోన్ క్లెయిన్ తెలిపారు.