omicron variant: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు(omicron variant news) క్రమంగా పెరుగుతున్నాయి. భూమండలంలోని రెండువైపుల ఉన్న దేశాల్లో ఈ కేసులు కనిపించాయి. అయితే, గతంలోని రకాల కంటే ఎంత ప్రమాదకరమనేది ఇంకా తెలియదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకు చాలా సమయం పడుతుందని చెబుతున్నప్పటికీ.. ముందస్తు చర్యలు చేపడుతున్నాయి చాలా దేశాలు. తమ సరిహద్దులను మూసివేస్తున్నాయి.
హాంగ్‌కాంగ్ నుంచి ఐరోపా, ఉత్తర అమెరికా శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ కేసులను(omicron variant latest news) గుర్తించారు. అలాగే నెదర్లాండ్స్‌లో ఆదివారం ఒక్కరోజే 13 కేసులు బయటపడ్డాయి. మొత్తంగా 61 కేసులు వచ్చినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు.. కెనడా, ఆస్ట్రేలియాలో రెండేసి కేసులు వెలుగు చూశాయి.
ఫ్రాన్స్‌లో 8 ఒమిక్రాన్ అనుమానిత కేసులు(omicron variant cases) వెలుగు చూశాయి. గత 14 రోజుల క్రితం ఆఫ్రికా పర్యటనకు వెళ్లి వచ్చిన వారిలో ఎనిమిది మందికి వైరస్ పాజిటివ్‌గా తెలిపినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. పొరుగు దేశాల్లో ఇప్పటికే కొత్త వేరియంట్ కేసులు రావటం ఆందోళన కలిగిస్తున్నట్లు ఫ్రాన్స్ పేర్కొంది. ఈక్రమంలో ఆఫ్రికా దేశాల నుంచి విమానాలను నిలిపివేసింది.
ఇజ్రాయెల్‌లోనూ కేసులు(omicron variant cases) నమోదైన క్రమంలో విదేశీయులపై ఆంక్షలు విధించింది. ఇతర దేశాల నుంచి వచ్చే విమానాలను రెండు వారాలాపాటు నిలిపివేసింది మొరాకో. సోమావారం నుంచి ఆంక్షలు అమలులోకి(travel ban) వస్తాయని స్పష్టం చేసింది. ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నప్పటికీ, ఇప్పటికే చాలా దేశాలకు పాకింది కొత్త వైరస్. సరిహద్దులను మూసివేయటం(countries closed their borders) అంతగా ప్రభావం చూపదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
వైరస్ అలిసిపోదు..
కరోనా జాగ్రత్తలు పాటించటం, మాస్కులు ధరించటం, భౌతిక దూరం, టీకాలు తీసుకోవటం వంటి విషయాలను వినీ వినీ అమెరికన్లు విసిగిపోయారని, అయితే, కరోనా వైరస్ అలసిపోదని గుర్తు చేశారు అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ కొలిన్స్. రక్షణ కవచాలను మరవొద్దని హెచ్చరించారు.
" దక్షిణాఫ్రికాలోని చాలా జిల్లాల్లో తక్కువ సమయంలో ఎక్కువ కేసులు నమోదైన క్రమంలో ఇది వేగంగా వ్యాపించే అంటువ్యాధిగా భావిస్తున్నా. ఒకరి నుంచి ఒకరికి వేగంగా అంటుకుంటోంది. అయితే, ఇది గతంలోని డెల్టా రకంతో పోటీ పడుతుందని అనుకోవట్లేదు. మాస్కులు ధరించటం, బూస్టర్ డోసుల పంపిణీ వంటి ఇప్పటికే ఉన్న వాటిని వేగవంతం చేయాలి. అలాంటి విషయాలను వింటూ అమెరికన్లు అలసిపోయారని నాకు తెలుసు, కానీ, వైరస్ అలసిపోదు. "
- డా.ఫ్రాన్సిస్ కొలిన్స్, యూఎస్ జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్.