ఐఎస్ఎస్-కె అగ్రనేత షనాల్లా గఫారీపై భారీ నజరానా ప్రకటించింది అమెరికా. గతేడాది కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన దాడిలో ప్రధాన సూత్రధారి అయిన గఫారీ ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.75 కోట్లు) ఇస్తామని ఆ దేశ రివార్డ్ ఫర్ జస్టిస్ విభాగం తెలిపింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని తెలపవచ్చని రివార్డ్ ఫర్ జస్టిస్ సోమవారం ట్వీట్ చేసింది.
అఫ్గాన్‌లో 20 ఏళ్ల పోరాటానికి ముగింపు పలికి.. బలగాలను పూర్తిగా స్వదేశానికి తరలించింది అమెరికా. ఈ క్రమంలో.. 2021 ఆగష్టు 26వ తేదీన కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రదాడి జరిపిన కారణంగా 185 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 150 మంది పౌరులు గాయపడ్డారు. అందులో 18 మంది అమెరికా సిబ్బంది ఉన్నారు.