ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ గత సంవత్సరం భారత్‌లోనూ దాడులకు యత్నించిందని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. కానీ, వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయన్నారు. ఐసిస్‌కు చెందిన ఖొరసన్ గ్రూప్(ఐసిస్-కె) ఈ మేరకు ప్రణాళికలు రచించిందని అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ రస్సెల్ ట్రావర్స్ వెల్లడించారు.
భారత్‌లో దాడికి యత్నం
భారత సంతతికి చెందిన సెనెటర్ మ్యాగీ హాసన్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ఐసిస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థల్లో ‘ఐసిస్-కె’నే అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు. ఇన్నాళ్లు కేవలం అఫ్గానిస్థాన్‌పైనే గురిపెట్టిన ఈ సంస్థ గత సంవత్సరం ఇతర ప్రాంతాలకూ తన ప్రణాళికలు విస్తరించిందని తెలిపారు. అందులో భాగంగా భారత్‌లో ఆత్మాహుతి దాడికి యత్నించారని.. కానీ, అది విఫలమయ్యిందని చెప్పారు.
గత నెల పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లోని కీలక ప్రాంతాల్లో ట్రావర్స్ పర్యటించారని, పలువురు భద్రతాధికారులు, నిఘా వర్గాలతో భేటీ అయ్యారని గుర్తు చేస్తూ.. ఈ పర్యటన ద్వారా ఐసిస్-కే ప్రాబల్యం పెరుగుతోందన్న విషయం స్పష్టంగా అర్థమయ్యిందన్నారు. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు.