తెలంగాణ

telangana

ఖాసీం మృతితో అమెరికా-ఇరాన్​ మధ్య యుద్ధమేఘాలు!

By

Published : Jan 3, 2020, 12:52 PM IST

అమెరికా-ఇరాన్​ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ నిఘా విభాగాధిపతి ఖాసీం సులేమనీ లక్ష్యంగా అమెరికా వైమానిక దాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్​ అగ్రనేతలు బహిరంగంగా ప్రకటించారు.

us-iran
us-iran

అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్​ అగ్రనేత ఖాసీం సులేమనీ మృతిచెందటం వల్ల పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో కీలక పరిణామంగా పరిగణిస్తున్న ఈ దాడిపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది.

ఖాసీం మృతికి ఇరాన్​తో పాటు పశ్చిమ ప్రాంతంలోని స్వతంత్ర దేశాలు ప్రతీకారం తీర్చుకుంటాయని ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ హెచ్చరించారు.

"ఇందులో ఎలాంటి అనుమానం లేదు. గొప్ప దేశమైన ఇరాన్​తో పాటు పశ్చిమాసియాలోని స్వతంత్ర దేశాలు అమెరికా పాల్పడిన ఈ నేరానికి ప్రతీకారం తీర్చుకుంటాయి."

- హసన్ రౌహానీ, ఇరాన్ అధ్యక్షుడు

ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమెనీ స్పష్టం చేశారు.

"దేశం కోసం అలుపెరగని పోరాటం చేసిన త్యాగధనుడు సులేమనీ. ఖాసీం దైవ సన్నిధికి చేరినా.. ఆయన చూపిన మార్గంలోనే పయనిస్తాం. ఖాసీంతోపాటు మరికొందరు అమరుల రక్తంతో చేతులు తడుపుకొన్న నేరస్థులు... ప్రతీకార దాడికి సిద్ధంగా ఉండాలి. "

- అయతొల్లా అలీ ఖమేనీ, ఇరాన్​ సుప్రీం నేత

ఖాసీం మృతి పట్ల 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు ఖమేనీ. ఈ వార్త తెలిసిన వెంటనే ఇరాన్‌ ఉన్నతస్థాయి భద్రతా సంస్థ అత్యవసరంగా సమావేశమై.. తదుపరి కార్యాచరణపై చర్చించింది.

ఇరాక్​ ప్రకటన

ఇరాక్​ రాజధాని బాగ్దాద్​ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ రాకెట్​ దాడిలో సులేమనీతోపాటు మిలిషియా గ్రూపు డిప్యూటీ కమాండర్​ అబు అల్​ ముహందీస్​, మరో ఆరుగురు మరణించారని ఇరాక్​ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

లెబనాన్​ లేదా సిరాయ నుంచి వచ్చిన ఖాసీంకు స్వాగతం పలికేందుకు మహందీస్​.. కాన్వాయ్​తో బాగ్దాద్​ విమానాశ్రయానికి వచ్చిన సమయంలో ఈ దాడులు జరిగినట్లు ఇరాక్​ వర్గాలు తెలిపాయి. ఖాసీం విమానం దిగిన వెంటనే రాకెట్ దాడులు జరిగినట్లు సమాచారం.

అమెరికా ధ్రువీకరణ

బాగ్దాద్​లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడికి ప్రతిగా ఈ దాడి చేసినట్లు పెంటగాన్​ ప్రకటించింది. అమెరికా ఎంబసీపై దాడి జరిగిన మరుసటి రోజే అమెరికా ప్రతిచర్య చేపట్టింది.

ఇదీ జరిగింది..

ఇరాన్‌తో సంబంధం వున్న ఉగ్రవాద సంస్థపై అమెరికా వైమానిక దళం ఆదివారం దాడులు జరిపింది. ఈ దాడుల్లో 25 మంది మిలిటెంట్లు మరణించగా, మరో 55 మందికి పైగా గాయపడ్డారు.

మృతుల్లో కతైబ్‌ హిజ్బుల్లాకు చెందిన నలుగురు కమాండర్లు ఉన్నారు. ఈ దాడిని నిరసిస్తూ మంగళవారం బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై వేలాది మంది ప్రతిదాడికి దిగారు. కార్యాలయం ఆవరణలోకి ప్రవేశించిన నిరసనకారులు.. ఫర్నీచర్‌తో పాటు టైర్లు కాల్చి విధ్వంసానికి దిగారు.

అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఇరాన్‌ అనుకూల ఉగ్రవాద సంస్థ కతైబ్‌ హిజ్బుల్లా సభ్యులు వైదొలిగిన వెంటనే అమెరికా ఈ దాడులకు దిగింది. కతైబ్​ సంస్థ మరికొన్ని దాడులు చేసే ప్రమాదం ఉందనే అనుమానంతోనే అమెరికా ఈ చర్యకు పాల్పడినట్లు పెంటగాన్‌ వర్గాలు వెల్లడించాయి.

ట్రంప్​.. పాంపియో ట్వీట్లు

విమానాశ్రయంపై దాడులకు సంబంధించి వార్తలు వెలువడిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​.. ఆ దేశ జాతీయ జెండాను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

ఖాసీం మృతితో ఇరాక్​ పౌరులు సంబరాలు చేసుకుంటున్నారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. ఈ మేరకు ఇరాక్​ జెండాతో వీధుల్లో పరుగెడుతున్న పౌరుల దృశ్యాలను ట్విట్టర్​లో పంచుకున్నారు పాంపియో.

యుద్ధ వాతావరణం!

కొంతకాలం నుంచి ఉద్రిక్తతలు నెమ్మదించినా రెండు దేశాల మధ్య పరిస్థితులు నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయి. తాజా దాడులతో అమెరికా-ఇరాన్​ మధ్య మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది. ఈ దాడి నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్​ తదితర దేశాలపై ఇరాన్​ మద్దతుదారులు దాడులు తీవ్రతరం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి ట్రంప్‌ సర్కార్‌ అర్థాంతరంగా వైదొలిగినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ తర్వాత కొన్ని నెలలపాటు ఇవే పరిస్థితులు కొనసాగాయి. ఈ క్రమంలో ఇరుదేశాలు పరస్పరం డ్రోన్లను కూల్చేసుకున్నాయి. కొద్ది రోజుల పాటు పశ్చిమాసియా సముద్రమార్గాల్లో చమురు ట్యాంకర్లపై దాడులు జరిగాయి.

ABOUT THE AUTHOR

...view details