అగ్రరాజ్యం నుంచి బలవంతంగా స్వదేశానికి పంపేస్తారన్న ఆందోళన... విద్య కోసం తీసుకున్న బ్యాంకు రుణాలు ఎలా చెల్లించాలో తెలియని గందరగోళం... కరోనా సోకుతుందన్న భయం... సెమిస్టర్ మధ్యలోనే చదువు ఆపేయాల్సి వస్తుందన్న దిగులు... కళాశాలకు ఎప్పటికీ తిరుగురాలేమన్న బెంగ... అమెరికా చదువు కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సంక్లిష్ట మానసిక స్థితి ఇది. ఇందుకు ప్రధాన కారణం... డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన నూతన వలస విధానం.
కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన సెమిస్టర్‌ను కొనసాగించేందుకు విశ్వవిద్యాలయాలు ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహిస్తే... విదేశీ విద్యార్థలు దేశం విడిచి వెళ్లవలసి ఉంటుందని లేదా బహిష్కరణకు గురవుతారని అమెరికా ఇమ్మిగ్రేషన్ అథారిటీ ప్రకటించింది. వేలాది మంది భారతీయులు సహా విదేశీ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపే ఈ కొత్త నిబంధనలపై ఇప్పటికే న్యాయపోరాటం ప్రారంభమైంది. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ), జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం కోర్టును ఆశ్రయించాయి. అందుకు ప్రిన్స్టన్, స్టాన్ఫోర్డ్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలు సహా మరికొన్ని మద్దతు పలికాయి.
దిల్లీ దౌత్యం ఫలించేనా?
వీసా నిబంధనలపై అమెరికా ప్రభుత్వం మెత్తబడేలా చేసేందుకు భారత ప్రభుత్వమూ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. వారం రోజుల క్రితం.. అమెరికా రాజకీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డేవిడ్ హేల్‌తో ఇదే అంశంపై చర్చించారు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా. ఇరు దేశాల విద్యార్థుల ప్రయోజనాలు, ప్రజా సంబంధాలను దృష్టిలో ఉంచుకుని కొత్త నిబంధనలపై పునరాలోచన చేయాలని కోరారు.
విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన
వీసా కొత్త నిబంధనల్లో మార్పు కోసం న్యాయపరంగా, రాజకీయపరంగా ప్రయత్నాలు జరుగుతున్నా... తుది ఫలితం ఎలా ఉంటుందోనని భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
" దీర్ఘకాలిక ప్రణాళికతో అమెరికా వచ్చిన విదేశీ విద్యార్థులకు ఇది పెద్ద దెబ్బ. కరోనాతో క్యాంపస్ మూసి వేసినప్పటికీ ఇక్కడే ఉన్నాను. నేను దేశం విడిచి వెళ్లాలనుకోవట్లేదు. వేరువేరు టైమ్ జోన్స్ కావటం వల్ల ఆన్లైన్ క్లాసుల్లో గందరగోళం ఏర్పడుతుంది. కానీ, అకస్మాత్తుగా నేను ఇక్కడ ఉండటం చట్టపరంగా చెల్లకుండా పోయింది. నా సెమిస్టర్, నా విద్యారుణాలు, ట్యూషన్ ఫీజు కోసం యూనివర్సిటీలో నేను చేసే పని పరిస్థితి ఏమిటి? ముఖ్యంగా నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతే.. ఎప్పుడైనా తిరిగి రాగలుగుతానా? ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం లేదు.