వలస విధానాల్లో సంస్కరణలు చేపడుతూ2021 పౌరసత్వ బిల్లును అమెరికా కాంగ్రెస్లో ప్రవేశ పెట్టడంపై భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా క్రష్ణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. వివిధ దేశాలకు ఇచ్చే గ్రీన్ కార్డుల కోటాను తొలగించడం వల్ల అమెరికాకు చాలా ఉపయోగాలున్నాయని అన్నారు. వివిధ దేశాల్లోని మేధావులు అమెరికాలో స్థిరపడతారని అప్పుడు అగ్రరాజ్యం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
"నైపుణ్యమున్న వలసదారుల చట్టానికి పూర్తిగా మద్దతుదారుడిని. వివిధ దేశాలకు ఇచ్చే ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోటాను తొలగించడం, హెచ్-1బీ విదేశీ కార్మికులపై ఆధారపడినవారికి పని అధికారం వంటి కీలక అంశాలున్న పౌరసత్వ సవరణ బిల్లు అమలైతే అమెరికాకు చాలా మంచి జరుగుతుంది. వివిధ దేశాల్లోని మేధావులకు ఉద్యోగావకాశం కల్పించి ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగు పరచొచ్చు. ఇది చట్టం అయ్యే వరకూ పోరాడతాను."