తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ ఔషధంతో హృదయనాళ వ్యవస్థపై తీవ్ర ప్రభావం!

హైడ్రాక్సీక్లోరోక్విన్​, అజిత్రోమైసిన్ వాడకం వల్ల కరోనా రోగుల్లో హృదయనాళ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు ఓ అధ్యయనం తేల్చింది. కరోనాకు ముందు వివిధ రకాల వ్యాధుల్లో ఈ ఔషధాల ప్రభావంపై మదింపు చేసిన పరిశోధకులు కరోనా రోగుల నివేదికలతో సరిపోల్చగా ఈ విషయం వెల్లడైందని తెలిపారు.

Hydroxychloroquine
హైడ్రాక్సీక్లోరోక్విన్

By

Published : May 26, 2020, 2:55 PM IST

కరోనాకు హైడ్రాక్సీక్లోరోక్విన్​ ఔషధం పనిచేస్తోందని కొంత మంది వైద్యులు సూచిస్తున్నారు. అదే సమయంలో దీని వాడకం వల్ల హృద్రోగ సమస్యలు తలెత్తుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆంటీబయాటిక్ అజిత్రోమైసిన్​తో కలిపి ఈ మలేరియా మందును వాడటం మరింత ప్రమాదకరమని తేల్చాయి.

తాజాగా జరిగిన మరో అధ్యయనం కూడా ఇదే రకమైన ప్రమాదాన్ని గుర్తించింది. కరోనా చికిత్సలో ఈ రెండు ఔషధాలను వాడితే హృదయనాళ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని గుర్తించారు అమెరికాలోని వాండర్​బిల్ట్​, స్టాన్​ఫోర్డ్​ విశ్వవిద్యాలయాల పరిశోధకులు.

కరోనాకు ముందే..

ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటాబేస్​లోని 2.1 కోట్ల తీవ్రమైన కేసుల నివేదికలపై అధ్యయనం చేశారు పరిశోధకులు. ఈ చికిత్స నివేదికలు 1967 నవంబర్​ 14 నుంచి 2020 మార్చి 1 మధ్య కాలంలో 130 దేశాల్లోని వివిధ వ్యాధులకు సంబంధించినవని తెలిపారు. ఈ అధ్యయనం సర్క్యులేషన్ అనే జర్నల్​లో ప్రచురితమైంది.

హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్.. లేదా రెండు ఔషధాల కలిపి వాడటం వల్ల రోగులలో ఉత్పన్నమైన సమస్యలు హృదయనాళాలపై ఔషధ ప్రతికూలతలు (CV-ADR)తో సరిపోల్చుకున్నారు. హృదయనాళాల ప్రక్రియలపై ప్రభావం చూపే ఔషధాల వల్ల తీవ్రమైన కార్డియాక్ ప్రోరిత్మోజెనిక్​ సమస్యలు తలెత్తుతాయి. హెచ్​సీక్యూ, అజిత్రోమైసిన్ వాడకం వల్ల కూడా ఇవే సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించారు.

"హైడ్రాక్సీక్లోరోక్విన్​ను నెలల తరబడి తీసుకోవటం వల్ల తీవ్రమైన గుండె వైఫల్యాలకు దారి తీస్తుంది. 76,822 మంది హైడ్రాక్సీ వాడగా.. వీరిలో 21 వేల మందిపై ఈ ఔషధం ప్రాణాంతకంగా మారింది. అజిత్రోమైసిన్​ 89,692 మందిపై ప్రయోగించగా.. 54 వేల మందిపై తీవ్ర ప్రభావం కనిపించింది. 607 మందిపై ఈ రెండు ఔషధాలు కలిపి ప్రభావం చూపాయి."

- పరిశోధకులు

పరీక్షల నిలిపివేత..

ఇప్పటికే కరోనా బాధితులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఇస్తూ వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న క్లినికల్‌ పరీక్షల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని డబ్ల్యూహెచ్​ఓ నిర్ణయించింది. కొవిడ్‌-19 బాధితులకు ఈ మందు వాడితే వారు మరణించే ముప్పు ఉంటుందని ఒక అధ్యయనం చెప్పటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details