అమెరికాలోని ఫ్లోరిడా, మియామి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో ఓ నల్లజాతి మహిళపై దాడి చేస్తూ బాడీ కెమెరాకు చిక్కాడు ఓ పోలీస్ అధికారి. ఈ వీడియోను దక్షిణ ఫ్లోరిడాకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత బిల్లీ కార్బెన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో సదరు పోలీస్ అధికారి సస్పెండ్ అయ్యారు.
ఇదీ జరిగింది...
విమానం ఆలస్యమైనందుకు.. మహిళ టిక్కెట్ కౌంటర్ వద్ద గట్టిగా ప్రశ్నించింది. దీంతో టిక్కెట్ ఏజెంట్ పోలీసులను పిలిచాడు. అక్కడికి చేరకున్న పోలీసులతోనూ మహిళ అదే స్థాయిలో వాగ్వాదానికి దిగిందని స్థానిక వార్తా ప్రత్రిక పేర్కొంది.
మహిళపై చేయిజేసుకున్న పోలీస్ సస్పెండ్!
ఆమె 'నువ్వు నల్ల జాతీయుడివైనా.. తెల్లజాతీయుడిలా ప్రవర్తిస్తున్నావ్. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు...' అంటూ, పోలీసు అధికారి మొహంలో మొహం పెట్టింది. దీంతో ఒక్కసారిగా పోలీస్ అధికారి మహిళను గట్టిగా కొట్టాడు. 'ఆమె నన్ను రెచ్చగొట్టింది..' అంటూ ఆవేశంగా మహిళను నెట్టేశాడు. దీంతో అక్కుడున్న ఇతర అధికారులు..ఆమెకు సంకెళ్లు వేసి బంధించారు.
మియామి- డేడ్ పోలీస్ డైరెక్టర్ అల్ఫ్రెడో రామిరేజ్.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా స్టేట్ అటార్నీకి కేసు అప్పగించారు.
ఇటీవల అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ ఘటనతో చెలరేగిన నిరసన జ్వాలలు చల్లారక ముందే.. మరో నల్లజాతీయురాలిపై పోలీసు చేయిజేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి:మిస్టరీ: 2నెలల్లో 350 ఏనుగుల మృతి!