ఇథియోపియాలో చెలరేగిన ఘర్షణల్లో ఆ దేశ సైన్యాధ్యక్షుడు, రాజకీయ నేత సీర్ మెకోన్నెన్ హత్యకు గురయ్యారు. రాజధాని అడీస్ అబాబాలో ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరు ఆయనను తుపాకితో కాల్చి చంపాడు. ఇథియోపియా ఉత్తర ప్రాంతం అంహారాలో ఓ జాతికి చెందిన తిరుగుబాటుదారులు స్థానిక ప్రభుత్వ అధికారులపై చేస్తోన్న దాడిని అడ్డుకునే క్రమంలో మెకోన్నెన్ ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ప్రధాని అబియ్ అహ్మద్ ప్రకటించారు.
అంహారా గవర్నర్ అంబచ్యూ మెకోన్నెన్‌తో పలువురు అధికారులు కీలక సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో గవర్నర్‌తో పాటు పలువురు అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రధాని తెలిపారు. ఈ దాడి వెనుక అంహారా ప్రాంత ప్రధాన భద్రతాధికారి అసామిన్యూ సిగే ఉన్నారని, ఆయనే దీనికి కుట్ర పన్నారని ప్రధాని కార్యాలయం ప్రకటన చేసింది. సైన్యాధ్యక్షుని హత్య నేపథ్యంలో ఇథియోపియా రాజధానిలోని అమెరికా అధికారులు, ప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని యూఎస్ సూచించింది.