కరోనా వైరస్ ప్రపంచ దేశాలపై మరింత వేగంగా విస్తరిస్తోంది. కేసులు, మరణాల్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ఇప్పటివరకు ఈ ప్రాణాంతక మహమ్మారి ధాటికి మరణించిన వారి సంఖ్య 37 వేలు దాటింది. కేసులు 8 లక్షలకు చేరువయ్యాయి. ఐరోపా దేశాల్లో కరోనా ప్రతాపం అధికంగా ఉంది. అక్కడ మరణాల సంఖ్య 27 వేలపైనే నమోదైంది.
స్పెయిన్‌లో...
ఈ దేశంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. కేసులు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. మరణాలూ అదే స్థాయిలో ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో అక్కడ 913 మంది కరోనాకు బలయ్యారు. మరో 7846 మంది బాధితులతో కేసుల్లో చైనాను మించింది. అక్కడ మొత్తం వైరస్ సోకిన వారి సంఖ్య 88 వేలకు సమీపంలో ఉంది.
కరోనా విజృంభణ తీవ్రమవుతున్న దృష్ట్యా స్పెయిన్ ప్రభుత్వం ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. ప్రజల్ని నియంత్రించే బాధ్యత పూర్తిగా సైన్యానికి అప్పగించింది. ఈ క్రమంలో వారికి అత్యవసర అధికారాల్ని కట్టబెట్టింది.
ఇటలీ..
ఇటలీలో మరణాలు తీవ్రంగానే ఉన్నప్పటికీ కేసుల వ్యాప్తి రేటు కాస్త తగ్గుముఖం పట్టింది. సోమవారం మరో 812 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 11 వేల 591కి చేరింది. 4050 కొత్త కేసులు నమోదుకాగా.. మొత్తం లక్ష దాటింది. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 12 వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది.
సోమవారం రికార్డు స్థాయిలో 1590 మంది వైరస్ నుంచి కోలుకున్నారని.. మొత్తం 14 వేల మందికిపైనే కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారని అధికారులు స్పష్టం చేశారు.
అమెరికాలో ఒక్కరోజే 20 వేలకుపైగా కేసులు...
అగ్రరాజ్యం అమెరికాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం మరో 573 మందికి ప్రాణాలు విడిచారు. నిన్న 20 వేలకుపైగా కేసులు నమోదుకావడం గమనార్హం. మొత్తం బాధితులు లక్షా 63 వేలు దాటారు. ఎక్కువభాగం న్యూయార్క్ వాసులే కావడం ఆందోళన కలిగిస్తోంది. మరో రెండు వారాల్లో దేశంలో మరణాల రేటు పెరుగుతుందని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం వైరస్ ఉద్ధృతికి అద్దం పడుతోంది.
ఫ్రాన్స్...
అమెరికా తర్వాత ఫ్రాన్స్‌లోనూ కేసులు పెరిగిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు దాదాపు రెట్టింపవడం గమనార్హం. మరో 418 మంది మరణించగా.. మొత్తం మృతులు 3024కి చేరారు. కేసుల సంఖ్య 44 వేల 550గా ఉంది.