అమెరికా-మెక్సికో సరిహద్దులో పెరుగుతున్న మానవీయ, రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది జో బైడెన్ పరిపాలనా విభాగం. భారీగా పెరుగుతున్న వలసలు తమ ప్రభుత్వ అజెండాపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో హుటాహుటిన చర్యలకు ఉపక్రమించింది.
ఏం జరుగుతోంది?
అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత తొలినాళ్లలో.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలను మార్చారు. అనేక నిబంధనలను సడలించారు. వలసల విషయంలో ట్రంప్ విధానాలను బైడెన్ మరింత సరళతరం చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. దాంతో చాలా దేశాల వారు సరిహద్దులకు చేరుకున్నారు. మరోవైపు.. పొరుగున ఉన్న గ్వాటెమాల, హోండురస్, ఎల్‌సాల్వెడార్‌లోని అంతర్గత గొడవల కారణంగా అక్కడి నుంచి కూడా భారీగానే వలస వచ్చారు. ఇప్పటికే వేలాది మంది సెంట్రల్ అమెరికన్ ప్రజలు కొన్నినెలలుగా సరిహద్దుల్లోనే చిక్కుకుపోయారు. ఇది కూడా సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్రంగా మారేందుకు కారణమైంది.
బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత గత ఫిబ్రవరిలో 18,945 కుటుంబాలు, 9,297 మంది అనాథ చిన్నారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది జనవరితో పోలిస్తే 168 శాతం పెరిగినట్లు పేవ్ పరిశోధన కేంద్రం వెల్లడించింది. పెద్ద సంఖ్యలో వలసలతో వారికి సౌకర్యాలు, రవాణాలో సవాళ్ల ఎదురువుతున్నట్లు తెలిపింది.
కొవిడ్ మహమ్మారిపైనే తన తొలి పోరాటంగా ప్రకటించిన బైడెన్ అజెండాపై వలసలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల మైనర్లు, కుటుంబాలు సరిహద్దులను దాటి ఆశ్రయం పొందాలని పెద్ద సంఖ్యలో వేచిచూస్తున్నారనే కథనాలు పెరిగిపోయాయి. ఫలితంగా... బైడెన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా ఉపశమనం బిల్లు, కొవిడ్‌పై పోరు వంటి కీలకాంశాలకు మీడియాలో పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. ఎక్కడ చూసినా వలసలే హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో బైడెన్ తక్షణం చర్యలకు ఉపక్రమించక తప్పటం లేదు.
అధ్యక్షుడు ఏం చెబుతున్నారు?
వలసదారులతో పరిస్థితులు తీవ్రంగా మారిన క్రమంలో తాను త్వరలోనే సరిహద్దులను సందర్శిస్తానని తెలిపారు అధ్యక్షుడు బైడెన్. సరిహద్దుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకు తెలుసునన్నారు. శ్వేతసౌధంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వలసలపై మాట్లాడారు.
'సరిహద్దుల్లో చాలా చేయాల్సింది ఉంది. ఆ పనిని పూర్తి చేసే ప్రయత్నంలోనే ఉన్నాం. ముఖ్యంగా గతంలోని వాటిని తిరిగి ఏర్పాటు చేస్తాం. అక్కడే ఉండి వారి స్వదేశం నుంచి సాయం పొందొచ్చు.'