తెలంగాణ

telangana

ETV Bharat / international

'పాక్​ విద్వేషాన్ని వీడి సుస్థిరాభివృద్ధిపై దృష్టి పెట్టాలి'

ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశాలు ముగిశాయి. ఈ వేదికలో పలు దేశాధినేతలు జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై గళం విప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ కూడా ప్రసంగించారు. ఉగ్రవాదంపై ప్రపంచమంతా ఏకం కావాలని, సమస్యల్ని కలిసికట్టుగా పరిష్కరించుకోవాలని మోదీ పిలుపునివ్వగా.. కశ్మీర్​ అంశంలో భారత్​పై విద్వేష ఆరోపణలు చేశారు ఇమ్రాన్​ ఖాన్​. ఈ సమావేశాల్లో భారత్​-పాక్​ ప్రధానుల ప్రసంగాలపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, మాజీ రాయబారి అశోక్​ ముఖర్జీ విశ్లేషణ...

'పాక్​ విద్వేషాన్ని వీడి సుస్థిరాభివృద్ధిపై దృష్టి పెట్టాలి'

By

Published : Sep 30, 2019, 5:25 PM IST

Updated : Oct 2, 2019, 2:58 PM IST

ఇటీవల ముగిసిన ఐరాస సర్వసభ్య సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ శాంతి సందేశాన్ని వినిపించారు. యావత్​ ప్రపంచ ప్రజల సంక్షేమమే తమ అభిమతమని ఉద్ఘాటించిన మోదీ... శాంతి స్థాపనకు గాంధీ మార్గంలో పయనించడమే శరణ్యమని పిలుపునిచ్చారు.

పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ప్రసంగం.. పూర్తి విభిన్నంగా సాగింది. విద్వేషం, ఉగ్రవాద భాషణం, వ్యక్తిగత దూషణల పర్వం.... కశ్మీర్​లో హింస తప్పదంటూ హెచ్చరికలు చేశారు. ప్రధాని హోదాను మరిచి... దాదాపు 50 నిమిషాలకుపైగా ప్రసంగంలో సగానికిపైగా కశ్మీర్​ అంశాన్నే ప్రస్తావించారు. వాతావరణ మార్పులు, పేదరిక నిర్మూలనపై అర్థరహిత వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో ఇరు దేశాధినేతల ప్రసంగంపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, మాజీ రాయబారి అశోక్​ ముఖర్జీ విశ్లేషణ.

2030 కల్లా సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా... 2015 సెప్టెంబర్​లో జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ప్రత్యేక సదస్సులో ప్రతిపాదించారు ప్రపంచ నేతలు. 2030 అజెండాలో పూర్తి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.

నాలుగేళ్ల అనంతరం.. 74వ సర్వసభ్య సమావేశాల్లో 2030 అజెండా గురించి మరోసారి చర్చించారు. పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పుల అంశాల్ని ప్రస్తావించారు.
ఇందుకోసం భారతదేశం కృషిచేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన.. నీతి ఆయోగ్​ ఎస్​డీజీ(సస్టేనబుల్​ డెవలప్​మెంట్​ గోల్స్​) డ్యాష్​బోర్డ్​ 2030 అజెండాలోని 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పురోగతి దిశగా పారదర్శకంగా ముందుకెళ్లింది.

అజెండా 2030 దిశగా మోదీ ప్రసంగం...

2019 సెప్టెంబర్​ 27న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన తీరు.. 2030 అజెండా లక్ష్యాల్ని సాధించేందుకు భారత్​ ఎలా కృషి చేస్తుందో, ఎలా ముందుకెళ్తుందో తెలియజెప్పింది. 15 నిమిషాల ప్రసంగంలో భారత్​లో ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాల్ని, మున్ముందు లక్ష్యాల్ని ప్రస్తావించారు మోదీ. లక్ష్యాల సాధన దిశగా వివిధ కార్యక్రమాలను సూచించి.. ప్రపంచానికి కొత్త ఆశలు చిగురింపజేశారు భారత ప్రధాని.

పేదరిక నిర్మూలన సహా వారిని చైతన్యవంతులను చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమాల్ని వివరించారు. ఆర్థిక సాధికారత(జన్​ ధన్​ యోజన), ఆరోగ్య బీమా ఆయుష్మాన్​ భారత్​, బహిరంగ మల విసర్జన నిషేధం, స్వచ్ఛ భారత్​ లక్ష్యాల సాధనలో గణాంకాలు భారత్​ ప్రయత్నాలను స్పష్టం చేస్తున్నాయి.

ఆధార్​, ప్లాస్టిక్​ నిషేధం...

సమర్థవంతమైన పాలనతో అభివృద్ధిని వేగవంతం చేయడానికి.. బయోమెట్రిక్​ సాంకేతికత, డిజిటల్​ ప్లాట్​ఫాం(ఆధార్​, డిజిటల్​ ఇండియా)ల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది.

వాతావరణ మార్పుల్ని అధిగమించడానికి.. 175 నుంచి 450 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సాధనకు భారత్​ కృషి, వచ్చే ఐదేళ్లలో సింగిల్​ యూస్​ ప్లాస్టిక్​ వాడకం పూర్తి నిషేధం సహా భారత లక్ష్యాల్ని మోదీ ఐరాస సదస్సులో ప్రస్తావించారు. స్వప్రయోజనాల కోసం మాత్రమే కాక.. ప్రపంచ ప్రజల శ్రేయస్సే తమ అభిమతమని మోదీ చెప్పడం విశేషం.

ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మౌలిక సదుపాయాల నిర్మాణానికి... కొయలిషన్​ ఫర్​ డిజాస్టర్​ రెసిలియెంట్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​(సీడీఆర్​ఐ) ఏర్పాటును ప్రతిపాదించారు మోదీ. వాతావరణ మార్పులపై పోరాడేందుకు స్థిరమైన పరిష్కారం అందించారు భారత ప్రధాని.

వివేకానంద, గాంధీ మార్గాల ప్రస్తావన...

2030 అజెండా దిశగా ప్రపంచ నేతలు... శాంతి లేనిదే సుస్థిరాభివృద్ధి సాధ్యం కాదని నొక్కిచెప్పారు. అదే విధంగా సుస్థిరాభివృద్ధి లేనిదే శాంతి ఉండదనీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే 1893లో అమెరికాలో స్వామి వివేకానంద వినిపించిన శాంతి, సామరస్య సందేశాన్ని గుర్తు చేశారు. శాంతి స్థాపనకై గాంధీ మార్గాలైన సత్యం, అహింసా సిద్ధాంతాలను ప్రస్తావించారు.

మానవాళిగా ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి ప్రపంచదేశాల ఐకమత్యం.. ప్రాధాన్యాలను వివరించారు. భవిష్యత్తు లక్ష్యాలను కూలంకషంగా వివరించారు.

ఇదీ చూడండి:ఐరాస: శాంతి, సామరస్య సందేశం.. మోదీ ప్రసంగం

అర్థరహితంగా ఇమ్రాన్​ ప్రసంగం...

భారత ప్రధాని మోదీ మాట్లాడిన అరగంట తర్వాత.. పాక్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ చేసిన 50 నిమిషాల ప్రసంగం పూర్తి భిన్నంగా ఉంది.

అజెండా ఇతివృత్తాల్లో లేని విధంగా... పాశ్చాత్య దేశాల్లో ఇస్లామోఫోబియా, భారత్​లోని జమ్ముకశ్మీర్​ పరిస్థితులు, భారత్​-పాక్​ అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం వంటి అంశాల్ని ప్రస్తావించి అజెండా లక్ష్యాలను తప్పుదోవ పట్టించారు. పాక్​ ప్రధాని వ్యాఖ్యలపై ప్రతిస్పందించే హక్కును భారత్​ ఉపయోగించుకుంది.

2030 అజెండా దిశగా లక్ష్యాలు సాధించాలంటే.. పాక్​ విద్వేష ప్రసంగాలను వీడి, సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరమెంతో ఉంది.

(అశోక్​ ముఖర్జీ, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, మాజీ రాయబారి)

Last Updated : Oct 2, 2019, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details