అమెరికాలోని ఫ్లోరిడాలో 12 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన(Florida building collapse)లో మృతుల సంఖ్య 4కు చేరింది. మరో 159 మంది ఆచూకి గల్లంతైనట్లు ఫ్లోరిడా మేయర్ డేనియెల్లా లెవిన్ కావా తెలిపారు. భవనం కాంక్రీట్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు శిథిలాల్లో ఇరుక్కుని గాయపడిన 11 మందిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
Florida building collapse: శిథిలాల కింద 159 మంది!
అమెరికా ఫ్లోరిడాలో భవనం కూలిన ఘటనలో నలుగురు మృతిచెందారు. దాదాపు 159 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.
ఫ్లోరిడాలోని మియామీలో గురువారం తెల్లవారుజామున పన్నెండు అంతస్తుల భవనంలో కొంతభాగం కుప్పకూలింది. చాంప్లైన్ టవర్స్ పేరిట పిలిచే ఈ బహుళా అంతస్తుల భవనంలోని దాదాపు సగం 130 యూనిట్లు కుప్పకూలినట్లు ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ చీఫ్ రే జడల్హా వెల్లడించారు. భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. భవనం కూలిన గంట వ్యవధిలోనే 35 మందిని విపత్తు సిబ్బంది రక్షించినట్లు పేర్కొన్నారు. ఈ బహుళ అంతస్థుల భవనంలో అమెరికా దేశస్థులతో పాటు పరాగ్వే, ఉరుగ్వే, వెనిజులా దేశాలకు చెందిన పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.