కరోనాపై పోరాడుతున్న 25 పేద దేశాలకు తక్షణం ఆర్థిక వెసులుబాటు కలిగేలా 'అంతర్జాతీయ ద్రవ్య నిధి' సంస్థ (ఐఎంఎఫ్) రుణ ఉపశమనం ప్రకటించింది.
"కరోనా మహమ్మారితో పోరాడుతున్న అత్యంత పేద దేశాలకు రుణ ఉపశమనం కలిగించడం ద్వారా... రానున్న 6 నెలలపాటు వారికి ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఫలితంగా ఆయా దేశాలు... తమ వద్దనున్న అత్యవసర ఆర్థిక వనరులను వైద్యంతో పాటు, ఇతర సహాయక చర్యలు చేపట్టడానికి వీలవుతుంది."
- క్రిస్టిలినా జార్జివా, ఐఎమ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్
ఆఫ్రికా దేశాలన్నింటికీ..
ఆఫ్రికాలోని దాదాపు అన్ని దేశాలతోపాటు అఫ్గానిస్థాన్, యెమెన్, నేపాల్, హైతీలకు కూడా ఐఎంఎఫ్ బోర్డు రుణ ఉపశమనం కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ధనిక దేశాలు ఆయా పేద దేశాలకు ఇచ్చిన రుణాలను... రెండేళ్ల వరకు అంటే ఈ మే 1 నుంచి 2021 జూన్ వరకు వసూలు చేయవద్దని ఐఎంఎఫ్... ప్రపంచ బ్యాంకుతో కలిసి విజ్ఞప్తి చేసింది.
ఎబోలాపై పోరు సమయంలో...
2015లో ఎబోలాతో పోరాడుతున్న పశ్చిమ ఆఫ్రికా దేశాలను ఆదుకోవడానికి... ఐఎంఎఫ్ మొదటిసారిగా 'కెటాస్ట్రొఫె కంటైన్మెంట్ అండ్ రిలీఫ్ ట్రస్ట్' (సీసీఆర్టీ)ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇదే ట్రస్టు ద్వారా కొవిడ్-19తో పోరాడుతున్న దేశాలకు నిధులు అందించనుంది ఐఎంఎఫ్.
సీసీఆర్టీకి నిధులు అందిస్తున్న దేశాల్లో జపాన్, బ్రిటన్, చైనా, నెదర్లాండ్స్ ప్రధానమైనవి. ప్రస్తుతం ఐఎంఎఫ్ వద్ద 500 మిలియన్ డాలర్ల మేర సీసీఆర్టీ నిధులు ఉన్నాయి.
ఇదీ చూడండి:మారని ఉత్తరకొరియా.. మరోసారి క్షిపణి పరీక్షలు!