Worlds Longest Running TV Show : బుల్లితెరపైఇప్పటిదాకా అనేక సీరియళ్లు, టీవీ షోలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. వాటిలో కొన్ని హిట్ అయి మరిన్ని సీజన్లుగా వస్తే.. మరికొన్ని మాత్రం అంతంత మాత్రంగానే టెలికాస్ట్ అయ్యి నిలిచిపోయాయి. అయితే ప్రతీ సీరియల్ కూడా స్టోరీని బట్టి వంద నుంచి వెయ్యి ఎపిసోడ్ల వరకు రన్ అవుతుంటాయి. మహా అయితే అయిదు వేల ఎపిసోడ్ల వరకు టెలికాస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఇప్పటిదాకా 10,000కు పైగా ఎపిసోడ్స్ టెలీకాస్ట్ అయిన టీవీ షో ఏదైనా ఉందా అంటే.. దానికి సమాధానం అవును అనే చెప్పాలి. సుమారు 16,000కు పైగా ఎపిసోడ్స్‌తో ఇప్పటికీ ఆ సీరియల్ బుల్లితెరపై ట్రెండ్ అవుతూనే ఉంది. అదే హిందీ సీరియల్ 'కృషి దర్శన్' .
Krishi Darshan DD Serial : 1967లో దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ వ్యవసాయ సమాచార కార్యక్రమం. మొత్తం 16,700 ఎపిసోడ్లు నడిచింది. ఇది 56 సంవత్సరాలకు పైగా నిరంతరాయంగా టెలికాస్ట్ అయి.. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన లైవ్ యాక్షన్ టీవీ ప్రోగ్రామ్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా.. ఇదొక నాన్ ఫిక్షన్ షో కావడం విశేషం.
'కృషి దర్శన్'ను మొదటి సారిగా 1967 జనవరి 26 న భారత ప్రభుత్వ టీవీ కార్యక్రమాల సామూహిక ప్రసార పరీక్షలో భాగంగా దూరదర్శన్ ఛానల్లో ప్రసారం చేశారు. అయితే.. దీన్ని మొదట్లో దేశ రాజధాని దిల్లీ పరిసర 80 గ్రామాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో విస్తరించారు. వ్యవసాయ సమాచారాన్ని గ్రామీణ ప్రాంత రైతులు, వ్యవసాయదారులకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 1967 నుంచి 2015 వరకు డీడీ నేషనల్ ఛానెల్లో ప్రసారమైన ఈ షో ను.. ఆ తర్వాత డీడీ కిసాన్ అనే కొత్త ఛానెల్‌కి మార్చారు.
ఇక ఈ సీరియల్ తర్వాత 'గైడింగ్ లైట్' (15,762 ఎపిసోడ్‌లు), 'జనరల్ హాస్పిటల్' (15,081 ఎపిసోడ్‌లు) వంటి అమెరికన్ టీవీ షోల కంటే ఇది ప్రపంచంలోనే ఎక్కువ కాలం నడచిన లైవ్ యాక్షన్ టీవీ షోలుగా చరిత్రకెక్కింది. 'డేస్ ఆఫ్ అవర్ లైవ్స్', 'యాజ్ ద వరల్డ్ టర్న్స్', 'ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్', 'వన్ లైఫ్ టు లివ్ ఆల్ ఫైండింగ్ ఎ ప్లేస్'.. షోలు టాప్ - 10 లో చోటు దక్కించుకున్నాయి. ఈ షోలన్నీ ఒక్కొక్కటి 11 వేల కంటే ఎక్కువ ఎపిసోడ్‌లను కలిగి ఉన్నాయి.