ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో అనే ప్రకటన రాగానే అభిమానులు చాలా సంతోషించారు. మళ్లీ ఆ తర్వాత సినిమాకి సంబంధించి అధికారికంగా ఎలాంటి సంగతులు బయటకు రాలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా ఆగిపోయిందని, దర్శకుడు మారిపోయారని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో చిత్రబృందానికి చెందిన పీఆర్వో ట్విటర్ వేదికగా స్పందించారు. "దర్శకుడు కొరటాల శివ, డీవోపీ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ‘ఎన్టీఆర్ 30’ పూర్వ నిర్మాణ కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది" అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
2024 వేసవి లక్ష్యంగా.. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం 'ప్రాజెక్ట్ కె'(వర్కింట్ టైటిల్). ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మాత. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని 2024 వేసవి లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరికిగానీ 2023 ప్రారంభంలోగానీ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి ఆ తర్వాత నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారట. ప్రేక్షకులకు ఓ విజువల్ వండర్‌లా ఈ సినిమాని చూపించడం కోసం విఎఫ్‌ఎక్స్ పనుల కోసం కూడా చిత్రబృందం ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటోదట. అవన్నీ పూర్తి చేసి 2024కి సినిమాని విడుదల చేయడానికి ప్రణాళికలు రచించినట్టు సమాచారం.
ముందున్నాయి మరిన్ని కబుర్లు..మహేష్‌బాబు- త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న సినిమాని శరవేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి వినోదం పంచాలని చిత్రబృందం శ్రమిస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలు కానుంది అంటూ చిత్ర వర్గాలు వెల్లడించాయి. ముందుముందు మరిన్ని ఆసక్తికరమైన తాజా కబుర్లు రాబోతున్నాయి సిద్ధంగా ఉండండి అని ఆయన చెప్పారు. తివిక్రమ్ శైలిలో సాగుతూనే యాక్షన్‌కు ప్రాధాన్యమున్న చిత్రమిదని తెలుస్తోంది. ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ స్వరాలు అందిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేష్- త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రమిది.