ఓవైపు మైమరపించే ముగ్ధమనోహర రూపం. మరోవైపు విమర్శకులను కూడా మెప్పించే నటనా కౌశలం. అన్నింటికీ మించి అద్భుతమైన డ్యాన్స్ ప్రతిభ. ఆమెనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. హిందీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న ఈమె కెరీర్ ఆరంభంలోనే ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది.
2003లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామను.. కెరీర్ ఆరంభంలో ఒక టేక్ తర్వాత మూవీ నుంచి సడన్‌గా తీసేశారట. తన కొత్త మూవీ 'ఫోన్ బూత్' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ విషయాన్ని చెప్పింది. "ఆ సినిమా పేరు 'సాయ'. ఆ మూవీలో జాన్ అబ్రహాం హీరోగా నటించగా.. తరా శర్మ అతనికి జోడీగా చేసింది. ఆ సినిమా షూటింగ్లో నా మీద చిత్రీకరించిన తొలి షాట్ తర్వాత.. డైరెక్టర్ కోపంతో ప్రొడ్యూసర్ వైపు చూసి వెంటనే ఈ సినిమా నుంచి కత్రినను తీసేయ్ అని ఆదేశించారు. దాంతో నా కెరీర్ ఇక ముగిసిపోయిందని చాలా భయపడిపోయాను. కానీ ఆ తర్వాత దేవుడి దయవల్ల స్టార్‌గా ఎదిగాను" అని పేర్కొంది. కాగా, కత్రిన చెప్పిన మాటల్ని బట్టి చూస్తే సాయ సినిమాకు అనురాగ్ బసు దర్శకుడిగా వ్యవహరించారు. కాబట్టి అనురాగ్నే ఆమెపై కోప్పడినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ చెప్పిన వెంటనే ప్రొడ్యూసర్ ఆ సినిమా నుంచి కత్రినను తప్పించారట.