Janhvi Kapoor Sridevi :అందాల నటి శ్రీదేవి కుమార్తెగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. బీటౌన్లో వరుస సినిమాలు చేస్తూ తెలుగులో కూడా బిజీ కాబోతోంది. అటు జాన్వీ సోదరి ఖుషీ కపూర్ ఈమధ్యే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా వీరిద్దరూ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ 8వ సీజన్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మ చనిపోయిన క్షణాలను గుర్తు చేసుకుని అక్కాచెల్లెళ్లు ఎమోషనల్ అయ్యారు. 'నాకు బాగా గుర్తుంది. నేను నా గదిలో ఉన్నప్పుడు ఫోన్ కాల్ వచ్చింది. ఇంతలో ఖుషి ఏడుస్తున్న శబ్ధం వినిపించింది. ఓవైపు రోదిస్తూనే తన గదిలోకి వెళ్లాను. అప్పుడు ఖుషి నన్ను చూడగానే ఏడుపు ఆపేసింది. తను నా పక్కనే కూర్చుని నన్ను ఓదార్చడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తను కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడనేలేదు' అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.
శ్రీదేవి, ఖుషి ఒకేలా!
'నేను కన్నీళ్లను ఆపుకోవాలని చూశాను. ఎందుకంటే అందరూ నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటారు. అందుకే ఏడవకూడదని బలంగా ఫిక్సయ్యాను' అని ఖుషీ కపూర్ తెలిపింది. తన తల్లి, సోదరి ఖుషి ఒకేలా ఉంటారని జాన్వి తెలిపింది. కాగా అందాల తార శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో కన్నుమూసింది. ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఇప్పటికే శ్రీదేవి ఫొటోలు పోస్ట్ చేస్తూ గుర్తుతెచ్చుకుంటుంటారు.