Rajnikanth Baba New Version Trailer: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. పెద్ద హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి బడా హీరోల సినిమాలను వారి బర్త్‌డేల సందర్భంగా విడుదల చేశారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కూడా రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన 'బాబా' సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ లింక్‌ను రజనీకాంత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. తన మనసుకు నచ్చిన సినిమా త్వరలో రీ రిలీజ్ కాబోతుందని వెల్లడించారు.
అయితే 'బాబా' సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని అదనపు సీన్లు యాడ్ చేస్తున్నారట. వీటికి కోసం ఇప్పటికే రజనీకాంత్ డబ్బింగ్ కూడా చెప్పారట. తాజాగా ఆయన డబ్బింగ్ చెప్తున్న ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అప్పట్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'బాబా'..
రజనీకాంత్ నటించిన 'బాబా' మూవీ 2002లో విడుదల అయింది. 'నరసింహ' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రజనీ మూడేళ్లు గ్యాప్ ఇచ్చి ఈ చిత్రాన్ని చేశారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయింది. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. మనీషా కొయిరాల హీరోయిన్గా చేసిన ఈ సినిమా ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీకాంత్ ఈ సినిమాలో హీరోగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్లు పూర్తయింది. మళ్లీ ఇప్పుడు సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.