'కాంతార' ఫేమ్ హీరో రిషబ్‌శెట్టిని చూస్తే తనకు అసూయగా ఉందని బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ''ఎవరైనా గొప్ప పని చేసినప్పుడు అసూయ రావడం సర్వసాధారణం. పోటీ పెరిగిందనే భావన కలుగుతుంది. అతడి విషయంలోనూ అదే ఉంది. ఎంతో అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించాడు. కష్టపడి పనిచేసి అతడిలా మంచి విజయాన్ని అందుకోవాలనిపించింది'' అని నవాజుద్దీన్ తెలిపారు.
ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్‌శెట్టి.. నవాజుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించాడు. ''ఆయన నటించిన ఎన్నో చిత్రాలు చూశాను. శ్రమించే గుణం, ఎన్నో కష్టాలతో ఆయన ప్రయాణం సాగింది. ఆయన కూడా మాలాంటి వ్యక్తే. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మేమంతా.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి ఘన విజయాన్ని అందుకోవాలని అనుకుంటాం. ఆయన ఎంతోమందికి గొప్ప స్ఫూర్తి. థియేటర్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎన్నో చిన్న పాత్రలు పోషించారు. నేను కూడా ఘన విజయాన్ని రుచి చూడటానికి ముందు చిన్న చిన్న పాత్రలు పోషించాను. కాబట్టి, మా ఇద్దరి ప్రయాణం ఒకటే'' అని రిషబ్‌శెట్టి వివరించారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సైతం 'కాంతార' టీమ్‌ను మెచ్చుకున్నారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందని అన్నారు. రిషబ్‌శెట్టి మేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.