Aishwarya Lekshmi Interview: ''హాస్య ప్రధానంగా సాగే పాత్రలు ఇదివరకెప్పుడూ చేయలేదు. తొలిసారి 'మట్టి కుస్తీ'తో నవ్వించే అవకాశం వచ్చింది. ఆ కోణంలో నటిగా ఈ సినిమా నాకో సవాల్ విసిరింది. తప్పకుండా నా నటన ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది'' అని చెప్పింది కథానాయిక ఐశ్వర్య లక్ష్మి. 'అందం.. నటన కలిస్తే ఐశ్వర్య లక్ష్మి' అంటూ ఇటీవల కథానాయకుడు రవితేజ మెప్పు పొందిన ఈమె, 'గాడ్సే' చిత్రంతో పాటు పలు అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. డిసెంబరు 2న రానున్న 'మట్టికుస్తీ'లో విష్ణు విశాల్‌కు జోడీగా నటించింది. చిత్రం విడుదలను పురస్కరించుకుని ఐశ్వర్య లక్ష్మి విలేకర్లతో ముచ్చటించింది.
''మంచి కుటుంబ భావోద్వేగాలు, వినోదం కలబోతగా రూపొందిన చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదు. ఆడ మగ సమానమే అనే సందేశాన్ని చాలా వినోదాత్మకంగా చూపించాం. ఇందులో నాది కథానాయిక పాత్రే అయినా... కొన్ని పోరాట ఘట్టాల్లో కూడా కనిపిస్తా. ఆ పాత్ర శారీరకంగా నా నుంచి చాలా డిమాండ్ చేసింది. ముందస్తుగా సన్నద్ధం కావాల్సి వచ్చింది. తొలిసారి కామెడీ కూడా చేశా. నాకు భావోద్వేగ సన్నివేశాలు చేయడం కొట్టినపిండి. కానీ ఎప్పుడూ నవ్వించలేదు. దాన్ని కూడా ఓ సవాల్‌గా తీసుకుని నటించా''