Nassar On Pawan Kalyan Comments : తమిళ సినిమాల్లో ఆ రాష్ట్ర నటులే నటించాలంటూ దక్షిణ భారత ఉద్యోగుల సంఘం తీసుకున్న నిర్ణయం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో నడిగర్ సంఘం (తమిళ సినీ ఆర్టిస్ట్స్ అసోసిషయేషన్) అధ్యక్షుడు నాజర్ స్పందించారు. తమిళ సినీ పరిశ్రమలో ఎలాంటి వివక్షకు తావు లేదని స్పష్టం చేశారు. తమిళ సినీ ఇండస్ట్రీలో ఇతర భాషల నటులను ప్రోత్సహిస్తున్నారని.. ఒకవేళ అలాంటి వివక్ష ఉంటే దానికి వ్యతిరేకంగా తానే మొదటగా గళం విప్పుతానని వెల్లడించారు. పాన్ ఇండియా యుగం నడుస్తున్న ప్రస్తుతం కాలంలో వివిధ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన నటుల సహకారం అవసరమని హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చెప్పారు. భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తం అవుతోందని దేశంలో ఏ మూలన ప్రతిభావంతులైన సాంకేతిక సిబ్బంది, నటులు ఉన్నా ప్రోత్సహించాలని సూచించారు.
"తమిళ సినీ పరిశ్రమలో ఇతర భాషల నటులను ప్రోత్సహించడం లేదంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది పూర్తిగా తప్పుడు వార్త. ఒకవేళ అలాంటి నిర్ణయమే తీసుకుంటే.. మొదటగా తానే ఆ వివక్షకు వ్యతిరేకంగా గళం విప్పుతాను. ప్రస్తుతం మనం పాన్ ఇండియా, గ్లోబల్ సినిమాలు చేస్తున్న సమయంలో ఉన్నాం. ఎంతో మంది ప్రతిభావంతులైన నటులు, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ అలాంటి నిర్ణయం తీసుకోరు. కేవలం తమిళ సినీ పరిశ్రమలోని కళాకారుల రక్షణ కోసం రాష్ట్రంలోనే చిత్రీకరణ చేయాలని దక్షిణ భారత సినిమా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సెల్వమణి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రతిభను అడ్డుకునే ప్రయత్నం కాదు."
--నాజర్, నడిగర్ సంఘం అధ్యక్షుడు
తమిళ సినీ పరిశ్రమలో నటులకు పరిమితులు విధిస్తూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని నాజర్ వివరించారు. ఇతర ప్రాంతాల నటులను తమిళ సినీ పరిశ్రమ ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉందన్నారు. సావిత్రి, రంగారావు లాంటి గొప్ప కళాకారులకు తమిళ సినీ పరిశ్రమ ప్రోత్సాహం అందించిందని గుర్తు చేశారు. తమిళ సినీ పరిశ్రమపై వస్తున్న ఈ నిరాధార పుకార్లను నమ్మవద్దని నాజర్ కోరారు. ప్రపంచ స్థాయి చిత్రాలను నిర్మించడానికి అందరూ ఐక్యంగా వ్యవహరించాలని సూచించారు.