60 ఏళ్లు.. 777 సినిమాలు. ఇది విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ ట్రాక్ రికార్డు. గంభీరమైన రూపుతో తూటాల్లాంటి డైలాగులతో సినీ హీరోలనే తలదన్నేలా ఉండేది ఆయన క్యారక్టర్. విలనిజానికి మారుపేరుగా నిలిచిన కైకాల ఎన్నో పౌరానికాల్లో నటించి అందరిని మెప్పించారు. అలా దుశ్శాసన, రావణ పాత్రల్లో ఓ వెలుగు వెలిగారు. అయితే ఆయన పూర్తిగా విలన్ పాత్రలకే పరిమితమైపోయారంటే అది పొరపాటే. ఆయనలో ఓ కరుణా హృదయం కలిగిన ఘటోత్కచుడు కూడా ఉన్నాడు. అన్న మాటే శాసనంగా పాటించిన భరతుడు ఉన్నాడు. అలా నాయకుడిగా, ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒక్కటేంటి కైకాల పోషించని పాత్ర లేదు.
అయితే అప్పట్లో కైకాలను ఎన్టీఆర్‌లా ఉండేవారని అనేవారు. అలా ఎన్టీఆర్‌కు దగ్గర పోలికలుండటం వల్ల సత్యనారాయణ ఖాళీగా ఉండకుండా ఆయనకు డూపుగా చాలా సినిమాల్లో నటించారు. 1960లో ఎన్టీఆర్ చొరవతోనే మోడరన్ థియేటర్స్ వారి 'సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి' చిత్రంలో నటుడిగా అవకాశాన్ని అందుకున్నారు. ఆ సినిమా దర్శకుడు ఎస్డీ లాల్ విఠలాచార్య శిష్యుడు కావటం వల్ల సత్యనారాయణలో ఉన్న ట్యాలెంట్‌ను గుర్తించి విఠలాచార్యకు పరిచయం చేశారు. అదే సత్యనారాయణ కెరీర్లో కీలక మలుపు. హీరో వేషాల కోసం వేచి చూడకుండా విలన్లు తక్కువగా ఉన్న ఇండస్ట్రీలో కొరతను తీరుస్తూ అవకాశాలను అందుకోవాలని విఠలాచార్య ఇచ్చిన సలహాను సత్యనారాయణ స్వీకరించారు.