తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

తెలుగు సినిమాల జోరు.. బాక్సాఫీస్ కళకళ.. వసూళ్లలో సూపర్ హిట్టు! - ఆర్​ఆర్​ఆర్​ కలెక్షన్స్​

2022 Indian Box office collections: కొవిడ్​ ముందుతో పోలిస్తే ఈ ఏడాది దేశీయ బాక్సాఫీస్‌ ఆదాయం బాగా పెరిగే అవకాశముందని ట్రేడ్​ వర్గాలు తెలిపాయి. 2019లో రూ.10,948 కోట్ల వసూళ్లు సాధించగా.. 2022లో రూ.12,515 కోట్ల కలెక్షన్లు వస్తాయని అంచనా వేశాయి. కాగా, ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌లో రూ.4,002 కోట్లు కలెక్ట్​ చేసినట్లు పేర్కొన్నాయి.

Boxoffice collections 2022
బాక్సీఫీస్​ కలెక్షన్స్​ 2022

By

Published : Jun 5, 2022, 6:42 AM IST

Updated : Jun 5, 2022, 6:53 AM IST

2022 Indian Box office collections: సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. థియేటర్లకు వచ్చే వారి సంఖ్య అధికమవుతున్నందున, ఈ ఏడాది దేశంలో సినిమాహాళ్ల ఆదాయం కొవిడ్‌ ముందు కంటే అధికంగా ఉంటుందని మీడియా కన్సల్టింగ్‌ సంస్థ ఓర్మాక్‌, మీడియా ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ గ్రూప్‌ఎంల సంయుక్త నివేదిక అంచనా వేసింది. బాక్సాఫీస్‌ ఆదాయం ఈ ఏడాది (2022)లో రూ.12,515 కోట్ల రికార్డు స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. కొవిడ్‌ ప్రబలక ముందు 2019లో దేశీయ బాక్సాఫీస్‌ ఆదాయం రూ.10,948 కోట్లు కాగా, ఈ ఏడాది దాన్ని అధిగమిస్తుందన్నది అంచనా.

ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌లో సినిమా థియేటర్ల టిక్కెట్ల విక్రయాలతో రూ.4,002 కోట్ల ఆదాయం లభించిందని పేర్కొన్నాయి. సగటున ప్రతినెలా రూ.1000 కోట్లకు మించి కలెక్షన్లు రావడమూ రికార్డేనని తెలిపింది. 2019 తొలి నాలుగు నెలల్లో వసూళ్లు రూ.3,550 కోట్లుగా ఉన్నాయి.

కొవిడ్‌ మూడో దశ ప్రబలినా..కొవిడ్‌ మూడో దశలో భారీగా కేసులు నమోదుకావడంతో జనవరిలో కొన్ని థియేటర్లు పనిచేయలేదు. సినిమా విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. 2019తో పోలిస్తే 18 శాతం థియేటర్లు తెరుచుకోకపోయినా, రికార్డు స్థాయి వసూళ్లు రావడం విశేషం. కొవిడ్‌ ముందుతో పోలిస్తే, ఏప్రిల్‌లో సీట్ల సామర్థ్యం కూడా 82 శాతమే ఉంది. ఈ నెలలో 90 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా. అందువల్ల ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరింత బాగా కలెక్షన్లు రావచ్చు. ఆకర్షణీయంగా ఉన్న భారీ బడ్జెట్‌ సినిమాలకు ఆదరణ బాగుందని నివేదిక వివరించింది. జురాసిక్‌ వరల్డ్‌ డొమినియన్‌, థార్‌, అవతార్‌ వంటి హాలీవుడ్‌ సినిమాలు కూడా విడుదల కానున్నాయని ప్రస్తావించింది.

తెలుగు సినిమాల జోరు..బాక్సాఫీస్‌ కలెక్షన్లు పెరగడానికి ప్రాంతీయ భాషా చిత్రాలు ప్రధాన కారణం అవుతున్నాయి. గత మూడేళ్లలో తెలుగు సినిమాల వసూళ్లు గణనీయంగా పెరిగాయి. జనవరి-మార్చి మధ్య 60 శాతం హిందీ బాక్సాఫీసు వసూళ్లు దక్షిణాదికి చెందిన అనువాద చిత్రాలతోనే వచ్చాయి. ఇందులో ప్రధానంగా ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 ఉన్నాయి.
*2022 తొలి నాలుగు నెలల్లో మొత్తం బాక్సాఫీస్‌ వసూళ్లలో తెలుగు సినిమాల వాటా 27 శాతంగా ఉంది. 2019లో ఇది 12 శాతం మాత్రమే. కలెక్షన్లలో హిందీ సినిమాల వాటా క్రమంగా తగ్గుతోంది. 2018లో 43 శాతంగా ఉన్న వాటా, 2019లో 39 శాతానికి, 2022లో 38 శాతానికి తగ్గింది.
*ఈ ఏడాది ఇప్పటివరకు విజయం సాధించిన చిత్రాల్లో కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 రూ.1,008 కోట్ల బాక్సాఫీస్‌ వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆర్‌ఆర్‌ఆర్‌ రూ.875 కోట్లు, ద కశ్మీరీ ఫైల్స్‌ రూ.293 కోట్లు, బీస్ట్‌ రూ.169 కోట్లు, గంగూభాయ్‌ కథియావాడి రూ.153 కోట్లు వసూళ్లు సాధించాయని నివేదిక తెలిపింది.

ప్రకటనలూ పుంజుకుంటున్నాయ్‌..ప్రేక్షకుల రాక అధికమవుతున్నందున, సినిమాహాళ్లలో వాణిజ్య ప్రకటనల ప్రదర్శన కూడా పెరుగుతోంది. కేజీఎఫ్‌-2 విడుదలైన వారంలో 280 బ్రాండ్ల ప్రకటనలు థియేటర్లలో ప్రదర్శితమయ్యాయి. 2019 కంటే ఇంకా ఇవి 20-25 శాతం తక్కువే. అయితే విభిన్న భాషల నుంచి మరిన్ని భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో, ఈ ఏడాది పండగ సీజన్‌ నాటికి థియేటర్లలో వాణిజ్య ప్రకటనలు ప్రదర్శించే బ్రాండ్ల సంఖ్య 350కి చేరొచ్చని నివేదిక వివరించింది. సినిమా ప్రకటనలకు కొత్త తరం అంకుర సంస్థలు, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్లు, వాహన, దుస్తుల కంపెనీలు పెట్టుబడులు పెట్టొచ్చని పేర్కొంది.

ఇదీ చూడండి: బాలీవుడ్​లోకి హృతిక్​ సోదరి ఎంట్రీ.. లుక్స్​ అదిరాయిగా

Last Updated : Jun 5, 2022, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details