online trading cyber crime : ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన రజత్ పతేరియా, అశ్విన్ బగాదారె ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ చేస్తే మంచి లాభాలు వస్తాయంటూ ప్రచారం చేశారు. దిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో కార్యాలయం ప్రారంభించారు. ఇందుకోసం డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించాలని... సాక్షి మెహతా పేరిట ప్రారంభించిన ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు. ఇది చూసిన హైదరాబాద్‌కు చెందిన మహిళ వారి మాటలు నమ్మి... నిండా మునిగారు.
ఆ మహిళ తొలుత రూ.5లక్షలు ట్రేడింగ్ నిమిత్తం ఆన్‌లైన్ ద్వారా పంపింది. ఆ తర్వాత రూ.88 లక్షల ట్రేడింగ్‌లో లాభాలు వచ్చాయని మోసగాళ్లు మహిళకు తెలిపారు. లాభం వచ్చిన మొత్తాన్ని పొందాలంటే మరికొంత నగదు చెల్లించాలంటూ దశల వారీగా వివిధ బ్యాంకు ఖాతాల్లో మహిళ నుంచి రూ.1.20 కోట్ల దండుకున్నారు. తాను మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.