తెలంగాణ

telangana

ETV Bharat / crime

తెల్లారితే నిశ్చితార్థం.. అంతలోనే ఘోరం - building collapse in warangal

building collapse: తెల్లారితే ఆ యువకుడికి నిశ్చితార్థం. బంధువులంతా ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వేడుకకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకని యువకుడు నగరానికి వెళ్లాడు. భారీ వర్షం కురుస్తుండటంతో నగరంలోనే పని చేస్తున్న తన తల్లి ఉంటున్న చోటుకి వెళ్లాడు. రాత్రికి ఇక్కడే ఉండి.. ఉదయాన్నే అమ్మను తీసుకుని వెళ్దాంలే అనుకుని అక్కడే నిద్రపోయాడు. తెల్లారేసరికి విగతజీవిగా కనిపించాడు. అసలేమైందంటే..?

తెల్లారితే నిశ్చితార్థం.. అంతలోనే ఘోరం
తెల్లారితే నిశ్చితార్థం.. అంతలోనే ఘోరం

By

Published : Jul 23, 2022, 10:27 AM IST

building collapse: భారీ వర్షాల కారణంగా వరంగల్‌లోని మండి బజారులో ఓ పాత భవనం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. ఇంతెజార్‌గంజ్‌ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన తిప్పారాపు పైడి(60) మండి బజార్‌లోని నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనతో పాటు సలీమా అనే మహిళ కూడా అక్కడే పని చేస్తున్నారు. వారిద్దరూ భవనం పరిసర ప్రాంతంలోని గుడిసెలో నివాసం ఉంటున్నారు.

శుక్రవారం సాయంత్రం సలీమా కుమారుడు ఫిరోజ్‌(22) ఆమెను చూసేందుకు నగరానికి వచ్చాడు. భారీ వర్షం కురుస్తుండటంతో శనివారం తెల్లవారుజామున వారి గుడిసెకు సమీపంలో ఉన్న పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పాత భవనానికి సంబంధించిన గోడలు సలీమా నివసిస్తున్న గుడిసెపై పడ్డాయి. ఈ ఘటనలో పైడి, ఫిరోజ్‌లు ఘటనా స్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సలీమాను స్థానికుల సాయంతో పోలీసులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సలీమా కుమారుడు ఫిరోజ్‌ తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో నివసిస్తున్నారు. ఫిరోజ్‌కు ఈ మధ్యే వివాహం నిశ్చియమైంది. రేపు (ఆదివారం) నిశ్చితార్థం జరగాల్సి ఉంది. దానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు నగరానికి వచ్చారు. దురదృష్టవశాత్తు పాత భవనం కూలి మృతి చెందడం స్థానికులను కలచివేసింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, ఏసీపీ గిరికుమార్‌ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details