కారు మీద వంతెన గిడ్డర్లు పడి.. ఒక్క క్షణంలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. నిర్లక్ష్యమో.. సాంకేతిక లోపమో తెలియదు కానీ.. రెండు నిండుప్రాణాలు బలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అనకాపల్లి సుంకరమెట్ట కూడలి వద్ద సుమారు రూ. 500 కోట్ల వ్యయంతో జాతీయ రహదారి ఇంటర్ ఛేంజ్ కోసం నిర్మిస్తున్న పైవంతెన(ANAKAPALLI FLYOVER) గడ్డర్లు మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండి కూలిపోయాయి. ఈ ఘటనలో విశాఖకు చెందిన ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అనకాపల్లి నుంచి పెందుర్తి మీదుగా ఆనందపురం వరకు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి సంబంధించి సుంకరమెట్ట ‘వై’ జంక్షన్ వద్ద జిల్లాలోనే అతిపెద్ద ఇంటర్ ఛేంజ్ నిర్మిస్తున్నారు. ఈ కూడలిలో ఎటువైపు నుంచి వాహనాలు వచ్చినా ఆగకుండా పరుగులు తీసేలా భారీగా ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా జంక్షన్ మధ్యలో ఉన్న ఫ్లైఓవర్‌పై 15 వరకు గడ్డర్లను పక్షం రోజుల కిందట అమర్చారు. ప్రస్తుతం వీటి కింద నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం వాహనాల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి రెండు గడ్డర్లు కూలిపోయాయి.
నుకాలమ్మ దర్శనం చేసుకుని వస్తుండగా..
వాస్తవానికి ఒకటి విరిగి పడిపోగా... రెండోది దీని ధాటికి కూలినట్లు చెబుతున్నారు. అదే సమయంలో వీటి కిందగా వెళ్తున్న కారు, ఆయిల్ ట్యాంకర్‌పై పడ్డాయి. కారులో ప్రయాణిస్తున్న విశాఖకు చెందిన తోడల్లుళ్లు సతీష్‌కుమార్ (37), సుశాంత్ మహంతి (36) అక్కడికక్కడే మృతిచెందారు. కారులో వెనక సీట్లో ఉన్న ముగ్గురు మహిళలు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో సునీత, లక్ష్మి అక్క చెల్లెళ్లు. భారీగా బరువు ఉన్న వీటిని తొలగించడం కష్టంగా మారింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్రేన్ సాయంతో మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వీలులేదని మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన గుత్తేదారులకు సంబంధించిన వ్యక్తులు ఎవరూ రాలేదని.. సహాయ చర్యలుచేపట్టడంలో ఆలస్యం జరగిందని మృతుడి బంధువులు నిరసనకు దిగారు. చివరికి పోలీసులు సర్దిచెప్పడంతో మంగళవారం అర్ధరాత్రి దాటాక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు మృతి చెందిన సతీష్ కుమార్, సుశాంత్ మహంతి ఇద్దరు తోడల్లులు అవుతారు. సతీష్ కుమార్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా... సుశాంత్ మహంతి హెచ్పీసీఎల్లో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కొత్తగా కారు కొనుక్కుని.. తలుపులమ్మ తల్లి లోవ, అనకాపల్లి నుకాలమ్మ దర్శనం చేసుకుని వస్తుండగా జరిగిన ప్రమాదంలో మృతి చెందారు.
అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కాయి
ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అనుబు (27), క్లీనర్ భాస్కరరావు (20)కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ట్యాంకర్ రాజమహేంద్రవరం వెళ్తుండగా వెనక భాగంపై గడ్డర్లు పడ్డాయి. క్షణం ముందు ఘటన జరిగి ఉంటే ట్యాంకరు క్యాబిన్‌పై పడి ఉండేవి. అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కడంతో తమిళనాడు రాష్ట్రం సేలానికి చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ ఊపిరి పీల్చుకున్నారు.
సవాల్‌గా గడ్డర్ల తొలగింపు
గడ్డర్ల కింద ఇరుక్కున్న మృతదేహాలను వెలికితీయడం పోలీసులకు సవాల్‌గా మారింది. సాయంత్రం 5.30 గంటల సమయంలో ప్రమాదం జరగ్గా, రాత్రి 8 గంటల వరకు సహాయ చర్యలు ప్రారంభం కాలేదు. విశాఖపట్నం ఎన్‌డీఆర్‌ఎఫ్ (జాతీయ విపత్తులు సహాయక దళం) రప్పించారు. రెండు భారీ క్రేన్ల సాయంతో గడ్డర్ల తొలగింపు చర్యలు రాత్రివరకూ కొనసాగించారు. ఎమ్మెల్యే అమర్‌నాథ్ సహాయ చర్యలను పర్యవేక్షించారు. డీఎస్పీ శ్రావణి, సీఐ భాస్కరరావు, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
అనకాపల్లిలో ఫ్లైఓవర్ గడ్డర్లు కూలి ఇద్దరు మృతిచెందడం చాలా బాధాకరమని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బి.వి.సత్యవతి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు.