New Bride Killed: పెళ్లై నెలరోజులు కూడా కాకముందే కాపురానికి వెళ్లబోనన్న కూతురును దారుణంగా హతమార్చాడో తండ్రి. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయంలో కూతురుకు అండగా నిలిచిన భార్యను కూడా కిరాతకంగా కొట్టి చంపేశాడు. ఆపై తాను కూడా గుళికల మందు తీసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
మహబూబ్నగర్ జిల్లా జైనల్లీపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య మంగళవారం తెల్లవారుజామున భార్య కళమ్మ, కూతురు సరస్వతిని రోకలిబండతో మోది హత్య చేశాడు. సరస్వతికి ఈనెల 8న మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన వరుడితో వివాహం జరిగింది. 15 రోజల తర్వాత ఆమె తల్లిగారింటికి వచ్చింది. తిరిగి కాపురానికి వెళ్లబోనంటూ తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయంలో తల్లి కళమ్మ సరస్వతికి అండగా నిలవగా కృష్ణయ్య మాత్రం వ్యతిరేకించారు.
కాపురానికి వెళ్లాల్సిందేనంటూ పట్టుపట్టాడు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన కృష్ణయ్య తల్లికూతుళ్లిద్దరినీ కర్రతో మోది దారుణంగా హత్య చేశాడు. తాను కూడా విషగుళికలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని బంధువులకు ఫోన్ ద్వారా తెలిపాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బంధువులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. తల్లికూతుళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు. కృష్ణయ్య మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.