భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర జనగామ జిల్లాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. తెరాస, భాజపా శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో దేవరుప్పులలో మాట్లాడిన బండి సంజయ్ తెరాస హయాంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారని.... ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీని విస్మరించారని మండిపడ్డారు. ఈ క్రమంలో... బండి సంజయ్ వ్యాఖ్యలపై తెరాస శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్రప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. దీనిపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెరాస ఎన్నికల ప్రణాళికలోని ఎన్ని హామీలను నెరవేర్చారని ప్రశ్నించారు.
ఈ క్రమంలో తెరాస, భాజపా శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో పలువురు భాజపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.