Cyber Crimes in Hyderabad : ‘‘హాయ్.. నేను సుశాంత్ శర్మ.. సైన్యాధికారిగా పనిచేస్తున్నా.. కశ్మీర్‌కు బదిలీ అయ్యా.. అక్కడికి వెళ్తే నాకు కారుతో పని ఉండదు. అందుకే నా ఇన్నోవా కారును రూ.10 లక్షలకే అమ్మేస్తున్నా.. ముందు స్పందించిన వారికే అవకాశం.. యాభై శాతం అడ్వాన్స్ ఇస్తే ఇన్నోవా కారు పంపిస్తా.’’ఓఎల్‌ఎక్స్, గూగుల్ మార్కెట్ ప్లేస్ వెబ్‌సైట్ల ద్వారా సైబర్ నేరస్థులు కొత్తగా చేస్తున్న మాయాజాలమిది.
రాజస్థాన్ కేంద్రంగా సైబర్ నేరస్థులు కొద్ది నెలలుగా ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలుంచిన వారితో మాట్లాడుతున్నారు. వారి వాహనం ఆర్‌సీ, ఆధార్ కార్డులు.. ఫోన్ చేసి ఇప్పించుకుంటున్నారు. అనంతరం వాహన యజమాని పేరు, నిందితుడి ఫొటోతో ఒక సైన్యాధికారి గుర్తింపు కార్డును తయారు చేస్తున్నారు. ఆర్‌సీ, ఆధార్ కార్డుపై వారి ఫోటోలుంచి బైకులు, కార్ల ఫొటోలను ప్రకటనలో ఉంచుతున్నారు. యాభై శాతం నుంచి అరవై శాతానికే ఇస్తామంటూ ఆశ పెడతుతున్నారు. ఇలా వందల సంఖ్యలో హైదరాబాద్, రంగారెడ్డి రిజస్ట్రేషన్ల కార్లు, బైకుల ఫొటోలు సేకరించారు. ప్రకటనలకు స్పందించిన వారి నుంచి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ బయానాగా తీసుకున్నాక.. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తున్నారు.