నగరంలో ఆరేళ్ల చిన్నారి పాశవిక హత్యాచార ఘటనపై అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. అత్యాచారానికి పాల్పడింది పల్లంకొండ రాజు మాత్రమే అయినా.. అతడిని తప్పించేందుకు బస్తీవాసి ఒకరు సహకరించారని తెలిసింది... ఆ వ్యక్తే రాజును తప్పించాడని పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క కొద్ది గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామంటూ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలపై పోలీసులను ప్రశ్నిస్తుండగా.. పోలీసులు మాత్రం రాజు ఆచూకీ ఇంకా లభించలేదని, పది బృందాలతో గాలిస్తున్నామంటున్నారు.
పారిపోవాలంటూ..
తల్లిదండ్రులతో ఉంటున్న చిన్నారిపై కన్నేసిన రాజు... నాలుగు రోజుల క్రితం చాక్లెట్ ఆశ చూపించి బాలికను తీసుకెళ్లాడు. పాశవికంగా చిన్నారిని హత్యచేసి శవాన్ని తన గదిలో ఉంచి తాళం వేసి బయటకు వచ్చాడు. బాలిక తల్లిదండ్రులు అతడిపై అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారి కోసం పోలీసులు, తల్లిదండ్రులు, స్థానికులు అన్నిచోట్లా గాలిస్తున్నప్పుడు రాజు స్నేహితుడు అతడిని పక్కకు తీసుకెళ్లి.. ఇక్కడి నుంచి పారిపోవాలంటూ చెప్పినట్లు తెలిసింది.