తెలంగాణ

telangana

ETV Bharat / crime

మత్తు సామ్రాజ్యానికి వాళ్లు రారాజులు.. ఏయ్‌ బిడ్డా.. ఇది మా అడ్డా.!

Drugs Supply from Goa to Hyderabad: అదో మత్తు సామ్రాజ్యం. సామాన్యుల్లా కనిపించే వ్యక్తుల చేతుల మీదుగా రూ.కోట్లు చలామణి అవుతుంటాయి. గోవా నుంచి హైదరాబాద్‌కు సాగుతున్న మాదకద్రవ్యాల సరఫరాకు నగర పోలీసులు కొంతమేర అడ్డుకట్ట వేయగలిగారు. మత్తుపదార్థాల వ్యాపారంలో చక్రం తిప్పుతున్న నలుగురు స్మగ్లర్లను రెండు నెలల వ్యవధిలో అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు.

drugs
drugs

By

Published : Oct 11, 2022, 9:28 AM IST

Drugs Supply from Goa to Hyderabad: గోవా నుంచి హైదరాబాద్‌కు సాగుతున్న మాదకద్రవ్యాల సరఫరాకు నగర పోలీసులు కొంతమేర అడ్డుకట్ట వేయగలిగారు. మత్తుపదార్థాల వ్యాపారంలో చక్రం తిప్పుతున్న నలుగురు స్మగ్లర్లను రెండు నెలల వ్యవధిలో అరెస్టు చేశారు. మరో ఆరుగురు సూత్రధారుల కోసం హెచ్‌న్యూ (హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌) పోలీసులు గోవాలోనే వేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రితీష్‌ నారాయణన్‌, జేమ్స్‌, నరేంద్ర ఆర్య, స్టీఫెన్‌లు గోవా అడ్డాగా సాగే మత్తు రవాణా సూత్రధారులు. వీరిని అరెస్టు చేశారు.

వీరిలో నరేంద్ర ఆర్య చాలా ప్రమాదకారిగా పేరున్న స్మగ్లర్‌. నేరుగా తానెవరో తెలియకుండా కోరిన సరకును గుమ్మం వరకు చేరవేయగలడు. డార్క్‌నెట్‌ ద్వారా ‘హోలీషాప్‌’ పేరుతో దందా నిర్వహిస్తున్నాడు. ప్రితీష్‌ నారాయణన్‌, ఫర్హాన్‌ అన్సారీతో కలసి మధ్యప్రదేశ్‌ నుంచి గోవా చేరాడు. నైజీరియాకు చెందిన జేమ్స్‌ 2021లో నకిలీ పాస్‌పోర్టుతో ఇండియా చేరాడు. పాతపరిచయాలతో తానే కొత్త సిండికేట్‌ను రూపొందించి హైదరాబాద్‌, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో నెట్‌వర్క్‌ నిర్మించుకునేంతగా ఎదిగాడు. ఇతడిని 2022లో గోవా పోలీసులు అరెస్టు చేశారు. మూడు నెలల తర్వాత బయటకొచ్చి మళ్లీ వ్యాపారం ప్రారంభించాడు. ఇతడి వద్ద మాదకద్రవ్యాలు కొనుగోలు చేసే 400 మందిలో 108 మంది హైదరాబాద్‌కు చెందినవారే. మత్తుపదార్థాల సరఫరాతో సంపాదించిన సొమ్మును కొందరు వ్యాపారులు సినిమా, ఫైనాన్స్‌, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడి పెడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

1700మందిలో బయటికొచ్చిన వారు 35 మందే..హెచ్‌న్యూ బృందం మొదటిసారి గోవాలో దాడులు చేసినప్పుడు అక్కడి పోలీసుల సహకారం కొరవడింది. రెండోవిడత సంయుక్తంగా దాడులు చేసి మాఫియాడాన్‌ జాన్‌ స్టీఫెన్‌ డిసౌజాను అరెస్టు చేయగలిగారు. మరింత సమాచారం రాబట్టేందుకు ఇతడిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. 40 ఏళ్లుగా అన్నీ తానై చక్రం తిప్పిన డాన్‌ జైలుపాలవడంతో చాలామంది వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే నిందితుల జాబితాలో చేరిన కొందరు ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. నగర పోలీసులకు పట్టుబడిన నిందితుల వద్ద 1700 మంది మత్తుపదార్థాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. వీరిలో సుమారు 200 మంది హైదరాబాద్‌కు చెందినవారే. వీరిపై కేసులు నమోదు చేసి.. నోటీసులివ్వగా, 35 మంది మాత్రమే పోలీసుల ఎదుట హాజరయ్యారు. మిగిలిన వారంతా ఎక్కడున్నారు? వీరికి మాదకద్రవ్యాల ముఠాలతో సంబంధాలున్నాయా.. కేసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లారా.. అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

రెస్టారెంట్లు.. పబ్‌లే కేంద్రాలు..స్నేహితులతో కలసి స్వేచ్ఛగా గడిపేందుకు అధికశాతం యువత వెళ్లేది గోవాకే. అక్కడ రెస్టారెంట్లు, పబ్‌లలో జరిగే వేడుకలు నిర్వహించేది మత్తుమాఫియా సూత్రధారులే. రూ.3000-5000 ప్రవేశ రుసుముతో పార్టీలో పాల్గొన్న యువతకు ఉచితంగా మత్తుమందు ఇస్తారు. ఒక్కసారి దాన్ని రుచిచూసిన వారు మరుసటిరోజు డబ్బు ఇచ్చి కొనుగోలు చేస్తారు. తెల్లవార్లూ వేడుకలు జరుగుతూనే ఉంటాయి. గోవాకు ఎక్కడి నుంచి సరకు వస్తుంది. ఎవరికి చేర్చాలి. ఎంత ధర నిర్ణయించాలనేది పూర్తిగా మాఫియా కనుసన్నల్లోనే జరుగుతుంది. కొందరు నైజీరియన్లు విడిపోయి కొత్త సిండికేట్‌గా ఏర్పడుతున్నారు. ఆధిపత్యం కోసం తరచూ గొడవలు పడుతుంటారు. కొన్నిసార్లు ప్రత్యర్థుల సమాచారం పోలీసులకు చేరవేస్తుంటారు. రూ.కోట్లల్లో సాగే మాదకద్రవ్యాల రవాణా వెనుక రెస్టారెంట్లు, పబ్‌ల యజమానులు ఉంటారనేది బహిరంగ రహస్యం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details