PM Compensation to Kamareddy Accident Victims : కామారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాద ఘటన బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందించాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రెండు ప్రభుత్వాలు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించాయి.
ఈ ఘటనపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. హసన్‌పల్లి ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Kamareddy Accident Updates : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అసన్‌పల్లి గేట్ సమీపంలో ఆదివారం రోజున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటాఏస్ లారీని ఢీకొట్టిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. వీరంతా చిల్లర్గి గ్రామంలో సమీప బంధువు దశదిన కర్మకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
అసన్‌పల్లి మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం : కామారెడ్డి జిల్లా అసన్‌పల్లి గేట్ సమీపంలో రోడ్డు ప్రమాద మృతుల పట్ల జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో ఆరుగురి మృతదేహాలకు నివాళులు అర్పించారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున రూ.3లక్షలు ఆర్థిక సాయం అందించారు. మృతులకు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం కూడా నివాళులు అర్పించారు. భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార మృతుల కుటుంబాలను ఓదార్చారు.