చిన్నప్పటి నుంచి ఆమె చదువులో ముందుండేది. ఈ క్రమంలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అంతలోనే ఆమెకు ఇంట్లో వాళ్లు వివాహం చేశారు. అయినా తన కల నిజం చేసుకోవాలనే పట్టుదలతో భర్తకు తోడుగా తాను కూడా వైద్య సేవలు అందించాలని అనుకుంది. ఆ ఆలోచనతోనే పీజీ చేస్తోంది.. ఇంతలోనే ఆమె కన్న కలలు కల్లలయ్యాయి. ఓ ప్రయాణంలో పరిచయమైన వ్యక్తి చేతిలో మృతి చెందింది.
ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేటకు చెందిన వైద్య విద్యార్థిని అక్షిత(27)కు నాలుగేళ్ల కిందట రేగొండ మండలం నిజాంపల్లికి చెందిన వైద్యుడితో పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఆయన భూపాలపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నారు. వారికి మూడేళ్ల వయస్సు పాప ఉంది. అక్షిత కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లోని మెడికల్ కళాశాలలో పీజీ చేస్తోంది. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుంది. ఐదు నెలల కిందట ప్రయాణంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువుకు చెందిన మహేశ్వర్మతో పరిచయం ఏర్పడింది. ఫోన్ నంబర్, సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలు సేకరించుకొని ఆమెతో చాటింగ్ చేశాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. తనకు పెళ్లి అయిందని, బిడ్డ ఉందని ఆమె తిరస్కరించింది. సామాజిక మాధ్యమాల ఖాతాల్లోని ఆమె ఫొటోలను దిగుమతి చేసుకొని మార్ఫింగ్ చేసి వేధింపులకు దిగాడు. డబ్బులు ఇవ్వాలని, తన వద్దకు రావాలని బెదిరించాడు.