ప్రేమించమని వెంటబడ్డాడు. తనంటే ఇష్టం లేదని చాలా సార్లు అతడికి నచ్చజెప్పింది ఆ యువతి. అయినా రాక్షసుడిలా వెంబడించాడు. ఎక్కడ కనిపిస్తే అక్కడ వేధించడం మొదలుపెట్టాడు. ఇక లాభం లేదనుకుని ఇంట్లో అతడి గురించి చెప్పింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ యువకుణ్ని మందలించారు. తమ కూతురి జోలికివస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. ఓవైపు అమ్మాయి ప్రేమించడం లేదన్న కోపం.. మరోవైపు ఆమె కుటుంబ సభ్యులతో బెదిరించిందన్న పగ వెరసి అతనిలో రాక్షసుణ్ని మేల్కొలిపింది. తనకు దక్కని అమ్మాయి వేరెవరికి దక్కకూడదు అనుకున్నాడు. తనను బెదిరించిన కుటుంబంపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. సరైన సమయం కోసం వేచి చూశాడు. ఆ ఘడియ రానే వచ్చింది. అమ్మాయి ఇంట్లో ఎవరూ లేని సమయం చూశాడు. దొరికిన అవకాశాన్ని తన పగ తీర్చుకోవడానికి ఉపయోగించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఆ యువతి నిద్రిస్తున్న తరుణంలో ఎవరికీ తెలియకుండా చొరబడ్డాడు. ఒంటరిగా ఉన్న ఆమె నిద్రలో ఉన్నప్పుడే గొంతు కోశాడు. అనంతరం ఏం ఎరగనట్టు కల్లు దుకాణానికి వెళ్లి ఫుల్లుగా తాగాడు. తర్వాత ఇంటికి వెళ్లి తలుపులు పెట్టుకున్నాడు.
సీన్ కట్ చేస్తే
ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురిని పిలిచారు. ఎంతకీ పలకకపోవడంతో నిద్రపోతుందేమోనని అనుకున్నారు. ఉదయం పది గంటలైనా నిద్ర లేవకపోయేసరికి అనుమానమొచ్చి మళ్లీ పిలిచారు. ఎంతకీ పలకడం లేదని తన గదిలోకి వెళ్లి చూసి షాకయ్యారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న కూతుర్ని చూసి గుండె పగిలింది. వెంటనే ఆ షాక్ నుంచి తేరుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే..
నెల్లూరు జిల్లా వెంకటగిరి కాలేజీమిట్టకు చెందిన చిగురుపాటి జ్యోతి(17)ని అదే గ్రామానికి చెందిన చెంచు కృష్ణ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ వేధించడం మొదలుపెట్టాడు. కృష్ణను జ్యోతి కుటుంబ సభ్యులు మందలించారు. ఆమెపై కోపాన్ని పెంచుకున్న కృష్ణ జ్యోతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె నిద్రిస్తుండగా వెళ్లి గొంతు కోశాడు. అనంతరం కల్లు కాంపౌండ్‌కు వెళ్లి కల్లు తాగి ఇంటికి వెళ్లాడు. మరోవైపు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు జ్యోతి కోసం చూడగా ఆమె గదిలో రక్తపు మడుగులో పడి ఉండటం గమనించారు. వెంటనే ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం జ్యోతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కృష్ణ అరెస్టు
ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. తమ కూతుర్ని చావు అంచులకు తీసుకెళ్లింది ఆ దుర్మార్గుడేనంటూ వారి వద్ద యువతి తల్లిదండ్రులు బోరున విలపించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణను అరెస్టు చేశారు.