పదేళ్ల కిందట అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మహానగరంలోని అనేక ప్రాంతాల్లో రాజీవ్‌గృహకల్ప (Rajiv Gruhakalpa) పేరుతో పేదల కోసం వేలాది ఇళ్లను అపార్టుమెంట్ల రూపంలో నిర్మించింది. అప్పట్లో ఈ రాజీవ్‌గృహకల్ప కాలనీ (Rajiv Gruhakalpa Colony)లు నగర శివార్లలో ఉండగా ఇప్పుడు వాటి చుట్టుపక్కల పెద్దఎత్తున అభివృద్ధి జరిగింది. దీంతో ఆ ఇళ్లకు భారీ డిమాండ్ పెరిగింది.
అయిదారేళ్ల కిందట రూ.ఆరేడు లక్షలకు వీటిని విక్రయించగా ఇప్పుడు ఒక్కో ఇంటికి రూ.10 లక్షలకు పైనే ధర పలుకుతోంది. సుభాష్‌నగర్ డివిజన్ సురారంకాలనీలో 134 బ్లాక్‌లలో రాజీవ్‌గృహకల్ప కాలనీ రూపుదిద్దుకుంది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి 2011 జూన్‌లో వీటిని ప్రారంభించారు. మొత్తం 4,302 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నిబంధనల ప్రకారం ఎవరికి కేటాయించిన ఫ్లాట్‌లో వారు మాత్రమే ఉండాలి. ఇతరులకు విక్రయించినా అది చెల్లదు. కానీ కొందరు బాండ్‌పేపర్ (Bond Paper) మీదే ఒప్పందం చేసుకొని క్రయ విక్రయాలను కొనసాగిస్తున్నారు. దీని కోసం స్థానిక నాయకులు మధ్యవర్తిత్వం చేస్తూ కమీషన్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది ఒక సూరారం కాలనీలోనే కాకుండా మహానగరంలో చందానగర్, ముషీరాబాద్, అన్నోజిగూడ, కౌకూర్, బండ్లగూడ, పోచారం, జవహర్‌నగర్, సూరారంకాలనీ, నిజాంపేట, జగద్గిరిగుట్టతోపాటు దాదాపు 30 చోట్ల రాజీవ్‌గృహకల్ప ఫ్లాట్లు నిర్మించగా చాలా వరకు క్రయవిక్రయాలు జరిగిపోయాయి.