FCI Inspections in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఎఫ్‌సీఐ తనిఖీల్లో పక్కదారి పడుతోన్న సీఎంఆర్ బియ్యం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించటం అక్రమార్కులకు కలిసి వస్తోంది. సరైన పర్యవేక్షణ లేక బోధన్ మండలం సాలూర క్యాంపు శివశక్తి రైస్ మిల్లర్ రూ.7.49 కోట్ల విలువైన బియ్యాన్ని సొంతానికి అమ్ముకున్నారు.
వ్యాపార ఒప్పందంలో నిర్ణీత గడువులోగా బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా.. మిల్లర్లు పైరవీలతో గడువు పెంచుకుంటూ పోతున్నారు. నిజానికి మిల్లు ఆడించటంలో ఆలస్యం జరగటం లేదు. బియ్యాన్ని తమ వ్యాపార అవసరాలకు వాడుకోవటం కోసమే కొందరు ఇలా చేస్తున్నారు. వారి కుంటి సాకులను వింటూ అధికారులు గడువు పెంచుతూ పోతున్నారు. సాలూర క్యాంపులోని రైస్‌మిల్లుకు గత యాసంగి, ఖరీఫ్‌లో కలిపి 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. యాసంగి గడువు ముగిసినా.. సదరు యజమాని కొంత బాకీ ఉన్నారు. ఖరీఫ్‌కు సంబంధించి ఇంకా సీఎంఆర్ మొదలే పెట్టలేదు. బోధన్‌లోని మిల్లర్ రూ.7.49 కోట్ల విలువైన 38,240 క్వింటాళ్ల బియ్యం అమ్ముకున్నట్లుగా అధికారులు లెక్కలు తేల్చారు.