సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో రెచ్చిపోతున్నారు. అమాయకుల అత్యాశనే ఎరగా వేసి... రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ.4,25,000 కొల్లగొట్టారు. చేసేది లేక బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయిచారు(cyber crime complaint).
లాభాల పేరిట..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన బాధితుడు ఆన్లైన్ మార్కెటింగ్ ఆకర్షణీయమైన ప్రకటన చూసి ఆగస్టులో అందులో జాయిన్ అయ్యారు. రూ.10 వేలు పెట్టుబడి పెట్టి చేరిన బాధితుడు... ఆ తర్వాత ఆకర్షణీయమైన లాభాలు చూపించడంతో మొత్తంగా రూ.4,25,000 పెట్టుబడి పెట్టారు. రెండు నెలల వ్యవధిలోనే రూ.15 లక్షలు అతడి ఖాతాలో ఉన్నట్టు చూపించడంతో ఆనందపడ్డారు. ఆ డబ్బును తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఇక్కడే అసలు విషయం బయటపడింది. ఖాతాలో ఉన్న డబ్బులు తీసుకునేందుకు యత్నించగా రాకపోవడంతో... బాధితుడు వారిని సంప్రదించారు. అయితే డబ్బులు రావాలంటే మరో మూడు లక్షలు పెట్టుబడి పెట్టాలని వారు సూచించడంతో అనుమానం వచ్చిన బాధితుడు... పోలీసులను(cyber crime complaint) ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రిప్టో కరెన్సీ అంటూ..
అధిక లాభాలు అంటూ ఆశచూపుతారు.. ముందుగా పెట్టుబడులకు కొంత మొత్తం లాభాలు అందించి ఎరవేస్తారు. అది నమ్మి అధిక పెట్టుబడులు పెట్టాక.. ముఖం చాటేస్తారు. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్లతో కోటీశ్వరులు కావొచ్చంటూ.. ఇటీవల సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న పశ్చిమ బంగాకు చెందిన ముగ్గురు నిందితులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నగంలో పలు కేసులు నమోదు కావడంతో పశ్చిమ బంగా వెళ్లిన పోలీసు ప్రత్యేక బృందం ఇక్రాం హుస్సేన్, నూర్ ఆలం, ఇజారుల్‌ని అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చింది. వారి నుంచి 6 సిమ్‌కార్డులు, 5 చరవాణులు, 3 బ్యాంకు చెక్కు బుక్కులు, 6 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లోని రూ.50 లక్షల నగదు నిలుపుదల చేశారు.