కరోనా టీకాల పేరుతో ప్రముఖులను మోసం చేస్తన్న వ్యక్తి బాగోతం బయటపడింది. సినీ రంగానికి చెందిన వ్యక్తులతో పాటు, ఎంటర్టైన్మెంట్ ఛానళ్లను లక్ష్యంగా చేసుకొని మోసాలు చేస్తున్న నాగార్జున రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వైద్య, ఆరోగ్యశాఖాధికారిగా పరిచయం చేసుకొని.. వాక్సిన్లను సరఫరా చేస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేయడం నిందితుడి ప్రత్యేకత. పది రోజుల క్రితమే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సినీ నిర్మాత సురేష్ బాబును మోసం చేసినందుకు గాను తాజాగా జూబ్లీహిల్స్ పీఎస్‌లోనూ నాగార్జునపై కేసు నమోదైంది.
గత నెల 31వ తేదీన సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తనకు తాను వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే నాగార్డున రెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. వాక్సిన్ల సరఫరాలో మీకు ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని... ఆ మేరకు మీకు వాక్సిన్ ఇస్తానని నాగార్జున రెడ్డి నమ్మబలికాడు. తన వద్ద 500 డోసులు ఉన్నాయని తెలిపాడు. అతని మాటలు నమ్మిన సురేష్ బాబు... తన నిర్మాణ సంస్థలోని కార్మికులకు, సిబ్బందికి టీకా వేయించొచ్చని ఆలోచించారు. ఒప్పందం కుదుర్చుకుని.... అతను అడిగిన లక్ష రూపాయలను సురేష్‌బాబు కార్యాలయ మేనేజర్ చెల్లించాడు. మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచాఫ్ వచ్చింది.
15 రోజులైనా ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి.. చివరికి నిన్న సురేష్ బాబు మేనేజర్ రాజేంద్రప్రసాద్ జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో నాగార్జున రెడ్డి పలువురిని మోసం చేశాడు. ఓ ప్రముఖ ఛానల్‌కు ఫోన్ చేసి వాక్సిన్ల సరఫరా కోసం లక్షన్నర రూపాయలను ఖాతాలో జమ చేయించుకున్నాడు. సినీ హీరో అలీ కార్యాలయానికి ఫోన్ చేసి ఇలాగే నమ్మించి 70వేల రూపాయలు వసూలు చేశాడు. ఈ విధంగా అతనిపై 7 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ప్రముఖ ఛానల్ ఇచ్చిన కేసులో... నాగార్జునను అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకు రిమాండ్‌కు తరలించారు. 4 రోజులు కస్టడీలోకి తీసుకొని నాగార్జున రెడ్డి మోసాల చిట్టాను బయటికి తీశారు.