facebook fake id scam: ఫేస్బుక్ నకిలీ ఖాతా సృష్టించి.. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి వలవేసి.. 85 లక్షల సొమ్ము కాజేసిన దంపతులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. తన భూమి వివాదంలో ఉందని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు బాధితుడు ఫిర్యాడులో పేర్కొన్నాడు. ఈ మోసానికి పాల్పడింది.... దంపతులు అని తెలిసి అవాక్కయ్యారు. నెల రోజుల క్రితం బాధితుడు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు దాసు, జ్యోతిని అరెస్టు చేశారు.
దంపతుల స్కాం ఎలా బయటపడిందంటే..
'సికింద్రాబాద్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఫేస్బుక్లో కల్యాణి శ్రీ అనే ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అయితే ఆమె ఎవరు అనేది అతనికి పరిచయం లేదు. అయినా కూడా అతను ఆ రిక్వెస్టును అంగీకరించాడు. తర్వాత ఆమెతో చాటింగ్ చేశాడు. ఈ క్రమంలో కల్యాణి శ్రీ... తాను విజయవాడలో ఉంటానని.. తనకు ఇంకా పెళ్లికాలేదని చెప్పింది. అయితే తన భూమి వివాదాల్లో ఉందని.. తనకు చెందాల్సిన ఆ భూమిని తన సోదరుడు కాజేయాలని చూస్తున్నాడని చెప్పింది. నువ్వు కనుక నాకు సాయం చేస్తే ఆ భూమి నాకు వస్తుంది..అందులో నీకు కొంత ఇస్తాను.. అయితే దానికోసం కొంత ఖర్చు అవుతుంది కాబట్టి ఆర్థిక సాయం చేయమని కోరింది. కల్యాణిశ్రీ మాటలు నమ్మిన అతను... అమె చెప్పిన ఖాతాల్లో డబ్బులు వేశాడు. ఇలా సుమారు ఏడాది కాలంలో 85 లక్షల వరకు పంపించాడు. ఇలా ఎంతకాలం అవుతున్నా భూమి విషయమై ఏమీ తేల్చకపోవడంతో నెలక్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫేస్బుక్ ఐడీ ఆధారంగా విచారణ చేపట్టగా.. సత్తెనపల్లిలో ఉంటున్న దాసు.. అతని భార్య జ్యోతి ఈ మోసానికి పాల్పడినట్లు తెలిసింది. -ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ.
ఇదీ చూడండి:Facebook: మీ పేరు మీద ఫేస్బుక్ నకిలీ ఖాతా ఉందా..?