గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. కుండపోత వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్థన్నపేట పట్టణం కేంద్రంగా ఆకేరు వాగు ఉదృతంగా ప్రవాహిస్తుండగా వర్ధన్నపేటతో పాటు రాయపర్తి, పర్వతగిరి, సంగెం మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై పత్తి, వరి పంటలు నీట మునిగాయి.
మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మధ్యాహ్నం పూటే చీకటిగా మారగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. జిల్లాలోని శ్రీరామగిరిలో ఒకటి, మాదాపురంలో ఒకటి, మునిగలవీడులో రెండు ఇళ్లు కూలిపోయాయి.
జనగామ జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి అన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అయితే జనగామ పట్టణంలో రంగప్ప చెరువు నిండుకుని అలుగు పారుతుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో విస్తారంగా పడుతున్న వానలకు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాల వల్ల కలిగే సమస్యలను తెలుసుకునేందుకు అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
ఇదీ చదవండి:తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కిషన్‌రెడ్డి