రెండు మూడు రోజులుగా ముసురు పట్టిన రాష్ట్రంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వానలు దంచికొట్టాయి. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో పలు చోట్ల రహదారులు కొట్టుకుపోగా వంతెనలు తెగాయి. చెరువు కుంటలు మత్తడి దుంకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వ్యవసాయ క్షేత్రాలను వరద ముంచెత్తింది. ఇటీవల నాట్లేసిన వరి చేలు, మొక్కజొన్న, కంది, కూరగాయ పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఆయా గ్రామాల మధ్య రోడ్డుపై ఉన్న లోతట్టు వంతెనలు మునిగిపోవడంతో రాకపోకలు నిలచిపోయాయి. పలుచోట్ల అప్రోచ్ రహదారులు వరద ఉద్ధృతికి తెగిపోవడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. కొన్ని చోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి.
నీటిలో ఎనిమిది మంది..
జగిత్యాల జిల్లాలో వరద నీటిలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు. మల్లాపూర్ మండలం పరిధిలో పెద్ద వాగుల వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో... వివిధ పనులకు వాగు అవతలి వైపునకు వెళ్లిన ఎనిమిది మంది చిక్కుకున్నారు. వేంపల్లికి చెందిన కాశన్న అనే వ్యక్తి వాగు ఉధృతికి కొట్టుకుపోయాడు. మిగతా వారిని కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రి ద్వారం వరద నిలిచిపోయింది. దీంతో దవాఖానాకు వచ్చే రోగులు నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు.
ఎడతెరిపి లేని వర్షాలు
నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. చెరువులు, వాగులు జలకళను సంతరించుకోగా.. ప్రాజెక్టుల్లోకి భారీ ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి లక్షన్నర క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. నిజాంసాగర్ దిగువన మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. కామారెడ్డి జిల్లాలో నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లను వరద ముంచెత్తింది. పలు చోట్ల వాగులపై వంతెనలు తెగి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
చేగుంటలో అత్యధికంగా 216 మి.మీ. వర్షపాతం..
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో పెద్దవాగు ఉప్పొంగడంతో సుమారు 2 గంటలపాటు రాకపోకలు నిలిచాయి. దీంతో డిగ్రీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. చందుర్తిలో పిడుగుపాటుకు కట్ట రాధ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడలోని ప్రధాన రహదారిలో మోకాళ్ల మట్టుకు నీళ్లు నిలవడంతో వాహనదారులకు అవస్థలు తప్పలేదు. బుధవారం రాత్రి 4 గంటల పాటు కురిసిన వర్షం మెదక్ జిల్లాను వణికించింది. ప్రధానంగా చేగుంటలో అత్యధికంగా 216 మి.మీ. వర్షపాతం నమోదయింది. ఇది రాష్ట్రంలో అత్యధికం కావడం గమనార్హం. రెండోది శివ్వంపేట మండలంలోని కొత్తపేటలో 143.5 మి.మీగా నమోదయింది.